సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీ ప్లీనరీ నిమిత్తం పలువురు వ్యక్తులు, సంస్థల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ‘గులాబీ కూలీ’పేరుతో పెద్ద మొత్తాల్లో డబ్బు వసూలు చేసి, అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు అందిందో? లేదో? చెప్పాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఫిర్యాదు అందితే, అది ఎప్పుడు అందింది.. దానిని జనరల్ డైరీ (జీడీ)లో ఎప్పుడు నమోదు చేశారు.. అసలు నమోదు చేశారో? లేదో? చెప్పాలంది.
ఒకవేళ జీడీ డైరీలో కూడా నమోదు చేసి ఉంటే ఆ ఫిర్యాదుపై ఏం చేశారో తెలియజేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలా డబ్బు వసూలు చేయడం అవినీతి కిందకే వస్తుందని, దీనిపై ఫిర్యాదు చేసినా ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ ఎస్.వి.భట్ విచారణ జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment