power minister
-
స్టాండింగ్ కమిటీకి ‘విద్యుత్’ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేట్ కంపెనీల ప్రవేశానికి వీలు కల్పించే వివాదాస్పద విద్యుత్ సవరణ బిల్లు–2022ను విస్తృత సంప్రదింపుల కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి సిఫార్సు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగంలోని సమాఖ్య సూత్రాలను ఉల్లంఘిస్తూ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తున్నారని కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయానికొచ్చింది. రైతు వ్యతిరేక బిల్లు అన్న విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చుతూనే బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపుతున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్‌కుమార్ సింగ్ లోక్‌సభలో ప్రకటించారు. సోమవారం ముందుగా లోక్‌సభలో విపక్ష పార్టీల తీవ్ర వ్యతిరేకత మధ్య ఈ బిల్లును సింగ్ ప్రవేశపెట్టారు. దీనిని విపక్షాలు వ్యతిరేకించాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుధ్ధం: అధిర్ రంజన్ కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఈ బిల్లును తీవ్రంగా తప్పుపట్టారు. ‘ఈ బిల్లు సమాఖ్య వ్యవస్థ సూత్రాలను ఉల్లంఘిస్తోంది. బిల్లుతో కేంద్ర పెత్తనం పెరిగి రాష్ట్రాల అధికారాలకు కత్తెర పడుతోంది. తెలంగాణ, పుదుచ్చేరి, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌తో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగినప్పుడు ఈ బిల్లును ఉపసంహరించుకుంటామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం)కు కేంద్రప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడేమో మాట తప్పి బిల్లును ప్రవేశపెట్టారు’ అని అ«ధిర్ రంజన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుదోవ పట్టిస్తున్నారు: మంత్రి సింగ్ ‘రైతులకు ఉచిత విద్యుత్ ఇకపైనా కొనసాగుతుంది. ఈ బిల్లు రైతు సంక్షేమ, ప్రజాహిత బిల్లు. బిల్లుపై ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి’ అని విద్యుత్ మంత్రి సింగ్ అన్నారు. మంత్రి మాట్లాడుతుండగా ప్రతిపక్షాలు ఓటింగ్‌కు డిమాండ్ చేశాయి. అయితే స్పీకర్ ఓం బిర్లా సభ్యులంతా తమ స్థానాల్లో కూర్చుంటే ఓటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. దీంతో పలువురు సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వెంటనే బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ కోరగా, స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. మూజువాణి ఓటుతో బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపేందుకు కేంద్ర మంత్రి అనుమతి కోరగా, స్పీకర్ అనుమతి ఇచ్చారు. దీనికి సభ్యులంతా ఆమోదం తెలిపారు. విద్యుత్‌రంగ ఉద్యోగుల నిరసన బాట విద్యుత్‌రంగ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోమవారం లక్షలాది మంది విద్యుత్ రంగ ఉద్యోగులు, ఇంజనీర్లు సోమవారం నిరసన గళం వినిపించారు. దేశంలోని అన్ని విద్యుదుత్పాదక సంస్థల ఉద్యోగులు, ఇంజనీర్లుసహా మొత్తం దాదాపు 27 లక్షల మంది సోమవారం విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారని అఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సమాఖ్య(ఏఐపీఈఎఫ్) ప్రకటించింది. విద్యుత్ వినియోగదారులకు ఇచ్చే రాయితీలకు చరమగీతం పాడే, రైతులు, అణగారిన వర్గాల ప్రయోజనాలకు తీవ్ర విఘాతంగా మారిన బిల్లులోని అంశాలను వెంటనే తొలగించాలని ఏఐపీఈఎఫ్ అధ్యక్షుడు శైలేంద్ర దూబే డిమాండ్‌చేశారు. ‘బిల్లులోని నిబంధనల ప్రకారం ఒకే ప్రాంతంలో ఎక్కువ విద్యుత్ పంపిణీ సంస్థలకు అనుమతి ఇస్తారు. ప్రభుత్వ నెట్‌వర్క్‌ను వాడుకుంటూ కొత్త ప్రైవేట్ సంస్థ లాభాలు తెచ్చే వాణిజ్య వినియోగదారులు, పరిశ్రమలకే విద్యుత్ అందించే ప్రమాదముంది. మొండి బకాయిలుగా మారే ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ ఇవ్వాలా వద్దా అనేది వారి ఇష్టం. ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు మాత్రం అందరికీ సరఫరా చేయాల్సిందే. దీంతో ప్రభుత్వ విద్యుత్ సంస్థలు నష్టాలపాలవుతాయి’ అని దూబే అన్నారు. -
లైట్లను ఆర్పేస్తే : గ్రిడ్ కుప్పకూలుతుంది
సాక్షి, ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజా పిలుపుపై స్వపక్షాలనుంచి హర్షంతో పాటు, కాంగ్రెస్ నేత శశిథరూర్ లాంటి విపక్షనేతలనుంచి, విద్యుత్తు ఇంజనీర్లు, నిపుణుల నుంచి కూడా విమర్శలు చెలరేగుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డాక్టర్ నితిన్ రావత్ ఈ పిలుపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు(ఏప్రిల్ 5, ఆదివారం) రాత్రి 9 గంటలకు 9 నిమిషాలు లైట్లు ఆపివేయాలన్న సూచనపై పునరాలోచన చేయాలని లేదంటే అత్యసర సేవలకు విఘాతం ఏర్పడే అవకాశం వుందని ప్రజలను కోరారు. ఒకేసారి అన్ని లైట్లను స్విచ్ ఆఫ్ చేసే ముందు మనం పునరాలోచించాలనీ, ఇది గ్రిడ్ వైఫల్యానికి దారితీస్తుందని పేర్కొన్నారు. గ్రిడ్ వైఫల్యం చెందితే అత్యవసర సేవలను ప్రభావితం చేస్తుందని చెప్పారు. లాక్ డౌన్ కారణంగా, ఫ్యాక్టరీ యూనిట్లు లేనందున డిమాండ్ ఇప్పటికే 23,000 మెగావాట్ల నుండి 13,000 మెగావాట్లకు తగ్గింది... ఇక ప్రజలందరూ ఒకేసారి లైట్లను ఆపివేస్తే సరఫరాలో భారీ వ్యత్యాసంతో (భారీ లోడ్ అకస్మాత్తుగా పడిపోవడం) విద్యుత్తు గ్రిడ్ కుప్పకూలిపోవచ్చని రావత్ చెప్పారు. అంతేకాదు తిరిగిసేవలను పునరుద్ధరించడానికి 12-16 గంటలు పడుతుందన్నారు. ప్రస్తుత సంక్షోభంలో విద్యుత్తు చాలా ముఖ్యమైన అవసరమని ఆయన పేర్కొన్నారు. అటు మోదీ పిలుపుపై స్పందించిన మహారాష్ట్ర గృహనిర్మాణ మంత్రి జితేంద్ర ఇదొక మూర్ఖత్వపు సూచన, పిల్లతనం తప్ప మరొకటి కాదని అవద్ విమర్శలు గుప్పించారు. శశిథరూర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానికి భవిష్యత్తుపైనగానీ, లాక్ డౌన్ తరువాత పరిస్థితులను ఎలా అంచనా వేయాలో తెలియదని, ఈ విషయంలో మోదీకి ఒక ‘విజన్’ అంటూ లేదని ఆయన ట్వీట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రీ కూడా ఇలాగే స్పందించారు. దేశానికి జీడీపీలో 8 నుంచి 10 శాతం విలువైన ఆర్ధిక ప్యాకేజీని ముందు ప్రకటించాలని ట్వీట్ చేసిన ఆయన లాక్ డౌన్ సందర్భంగా ఉపాధిలేక తస్వస్థలాల బాట పట్టిన వేలాది కార్మికులకు, శ్రామిక జీవులకు వెంటనే వేతనాలు మంజూరు చేయాలని హితవు చెప్పారు. ఫేక్ న్యూస్ ని అణచివేత పేరుతో నిజమైన మాద్యమాలను నోరు నొక్కొద్దంటూ మహువా తీవ్రంగా హెచ్చరించారు.మరోవైపు ఇదే విషయంలో తెలంగాణా విద్యుతు ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పారిశ్రామిక డిమాండ్ భారీగా పడిపోయిన నేపథ్యంలో ఆకస్మికంగా అందరూ స్విచ్-ఆఫ్ చేస్తే గ్రిడ్ కూలిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రులకు అవసరమైన విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా కరోనావైరస్ మహమ్మారితో దేశంలో అలుముకున్న చీకటితో పోరాడటానికి కొవ్వొత్తులు, మట్టి దీపాలు, లేదంటే కనీసం మొబైల్ టార్చి లైట్లను వెలిగించాలని, సామూహిక శక్తిని నిలపాలంటూ దేశ ప్రజలకు ఇచ్చిన ఒకవీడియో సందేశంలో ప్రధాని మోదీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. (చదవండి : కరోనా సంక్షోభం: స్నాప్‌డీల్ డెలివరీ హామీ) -
మెరుగైన విద్యుత్ అందిస్తాం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అన్ని వర్గాల వారికి మెరుగైన విద్యుత్‌ను అందిస్తామని విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కొన్ని సంస్థల నుంచి విద్యుత్ శాఖకు రూ.1000 కోట్లకు పైగా రావాల్సిన బకాయిలు త్వరలోనే వసూలు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన చోట్ల 33/11కేవీ తో పాటు 132/33 కేవీ సబ్స్టేషన్లను నిర్మించి విద్యుత్ కొరత లేకుండా చూస్తామని బాలినేని చెప్పారు. తీర ప్రాంతాల్లో పాత విద్యుత్ లైన్లను మార్చి కొత్త లైన్లను ఏర్పాటు చేస్తామన్నారు. రొయ్యల చెరువులు, ఉప్పుకొటార్లు ఉన్న ప్రాంతాల్లో తరచూ లైన్లు దెబ్బతింటూ విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతోందన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పాతలైన్లను మార్చే ప్రయత్నం చేయలేదన్నారు. ప్రజలకు సక్రమంగా విద్యుత్ అందించేందుకు పాతలైన్లను మార్చివేస్తామని మంత్రి చెప్పారు. ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న 10 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. పశ్చిమ ప్రాంతంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అవసరమైన చోట్ల మరిన్ని సబ్స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి బాలినేనితెలిపారు. ఎన్ని కోట్లు ఖర్చైనా రాష్ట్ర వ్యాప్తంగా హై ఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (హెచ్‌వీడీఎస్)ను పూర్తి చేసి రైతులకు మెరుగైన విద్యుత్‌ను అందిస్తామన్నారు. ప్రకాశం జిల్లాలో రూ.200 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్న హెచ్‌వీడీఎస్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. రైతులకు ఇవ్వాల్సిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వెంటనే మంజూరు చేస్తామని బాలినేని చెప్పారు. రైతులతో పాటు అన్ని వర్గాలపై అదనపు విద్యుత్ చార్జీల భారం లేకుండా చూస్తామన్నారు. అన్ని రకాల పరిశ్రమలకు సకాలంలో విద్యుత్ సర్వీసులు ఇచ్చి విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రాష్ట్రంలో పవన విద్యుత్‌కు ప్రాధాన్యత ఇచ్చి మరిన్ని చోట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు మంత్రి బాలినేని చెప్పారు. ఎర్రచందనాన్ని కాపాడుతాం: రాష్ట్రంలోని నల్లమల, శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనాన్ని కాపాడుతామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు ఎర్రచందనాన్ని అక్రమంగా నరికి పెద్ద ఎత్తున స్మగ్లింగ్‌కు పాల్పడ్డారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని అరుదైన సంపదైన ఎర్రచందనాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆయన చెప్పారు. ఎర్రచందనాన్ని కాపాడేందుకు మరింత కట్టుదిట్టంగా చర్యలు చేపడతామన్నారు. అటవీ శాఖ అధికారులతో పాటు టాస్క్‌ఫోర్స్ టీమ్‌లను మరింత బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అటవీశాఖలో ఖాళీగా ఉన్న 3 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అటవీ ప్రాంతాల్లో పనిచేసేందుకు తక్కువ వయసున్న వారిని నియమిస్తామన్నారు. ఎర్రచందనం ప్లాంటేషన్లు ఏర్పాటు చేస్తామని బాలినేని చెప్పారు. ఉన్న ఎర్రచందనాన్ని గ్లోబల్ టెండర్స్ ద్వారా అమ్మకానికి పెట్టి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుతామన్నారు. స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ శాఖాధికారులు చందనాన్ని కాపాడే విధంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. అడవుల అభివృద్ధితో పర్యావరణాన్ని కాపాడుతాం : అడవులను అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని బాలినేని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మొక్కల పెంపకం, అటవీ అభివృద్ధి కాగితాల్లో లెక్కలకే పరిమితమైందని విమర్శించారు. ఇప్పుడు అలా కాకుండా లక్ష్యాలు నిర్దేశించుకుని అడవులను సంరక్షిస్తామన్నారు. అటవీ శివారు ప్రాంతాల్లో మొక్కల ప్లాంటేషన్లు, పశుగ్రాసాలు, వంటచెరకు పెంచి ప్రజలు ముఖ్యంగా గిరిజనులు అడవుల్లోకి వెళ్లి చెట్లు నరకకుండా చర్యలు చేపడతామని చెప్పారు. అటవీ ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. దీంతో పాటుగా వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్న ఎకో టూరిజంను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి బాలినేని తెలిపారు. అడవుల పరిరక్షణతో వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి చెప్పారు. పశ్చిమ ప్రాంత వరప్రదాయిని అయిన వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేసి జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు అందిస్తామని చెప్పారు. ఇవే కాక జిల్లాకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామని అన్నారు. -
ఏం టైమింగ్.. పవర్ మంత్రికి భలే అనుభవం
వారణాసి: ఆహా.. ఏం టైమింగ్ అని సాధారణంగా అంటుంటాం. ఎవరి గురించి మాట్లాడుతామో.. ఏ విషయం గురించి చర్చిస్తామో దాన్ని ప్రతిబింబించేలా ఆవ్యక్తి వచ్చినప్పుడుగానీ, ఆ విషయం తాలూకు ఆనవాళ్లు కనిపించినప్పుడు ఈ టైమింగ్ అనే డైలాగ్‌ను ఉపయోగిస్తుంటాం. సరిగ్గా నిజంగా ఏం టైమింగ్ అన్నట్లుగా కేంద్ర మంత్రి ఉన్నచోట ఏర్పడిన పరిస్థితిని చూసి అక్కడి వారంతా అనుకున్నారు. ఇంతకీ ఎవరా కేంద్రమంత్రి? ఏం సంఘటన అక్కడ జరిగిందని అనుకుంటున్నారా? ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. బీజేపీ తరుపున ప్రచారంలో పాల్గొన్న కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్ గోయల్ అనంతరం పత్రికా సమావేశంలో మాట్లాడేందుకు వచ్చారు. సరిగ్గా ఆయన మాట్లాడుతుండగానే పుటుక్కున కరెంట్ పోయింది. లైట్లు ఆగిపోయాయి. అది కూడా సరిగ్గా విద్యుత్ అంశంపై మాట్లాడుతుండగానే కావడంతో అక్కడ ఉన్నవారంతా ఏం టైమింగ్ మంత్రిగారిది అని గుసగుసలాడారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఉపయోగిస్తున్న అస్త్రాల్లో విద్యుత్ సమస్య కూడా ఒకటి. తాము అధికారంలోకి వస్తే కరెంట్ సమస్యే ఉండదని, పూర్తి స్థాయిలో విద్యుత్‌ను అందిస్తామని ఆయన హామీ ఇస్తున్న సమయంలోనే లైట్లు ఆగిపోవడంతో అందరు బిత్తరపోయి నవ్వుకున్నారు. అయితే, తాను చీకట్లోనే ప్రెస్ మీట్ నిర్వహించిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ సమాజ్‌వాది పార్టీపై విమర్శలు చేశారు. విద్యుత్ అందరికీ సమానంగా అందించాలని, ఇలా అంతరాయం కలిగిస్తూ కొన్ని ప్రాంతాలకే పూర్తి సహాయం చేస్తే ఎలా అని ఆయన నిలదీశారు. ‘నేను నా గురించి ఆందోళన చెందడం లేదు.. బాధపడటం లేదు. నేను కాలేజీల్లో, పాఠశాలల్లో చదివే విద్యార్థుల గురించి ఫీలవుతున్నాను. రైతుల గురించి, ఆస్పత్రిలో వైద్యం చేస్తున్న వైద్యుల గురించి, రోగుల గురించి ఆందోళన చెందుతున్నాను’ అని గోయల్ అన్నారు. -
ఏపీలోనూ పోటీ చేస్తాం: యూపీ మంత్రి
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ బలోపేతానికి కృషిచేయాలని యూపీ విద్యుత్ శాఖ మంత్రి శైలేంద్ర యాదవ్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. పార్టీ ఏపీ జిల్లా అధ్యక్షుల సమావేశం తిరుపతిలోని రాష్ర్ట కార్యాలయంలో సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ యూపీలో 2017లో ఎన్నికలు జరగనున్నాయని, మరోమారు పార్టీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు. ఏపీలో పార్టీని శక్తివంతం చేయాల్సిన బాధ్యత యువ నాయకులపై ఉందన్నారు. ఇప్పటికే 13 జిల్లాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయిందని తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీ, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెడుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ ఏపీ శాఖ కార్యదర్శి జి. మురళీమోహన్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు కోటప్ప, నెల్లూరుజిల్లా అధ్యక్షుడు రవికుమార్, యువజన నాయకులు దామోదర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఆయన శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరస్వామి(ముక్కంటి) వారిని కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం దర్శించుకున్నారు. వారికి అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. -
నల్గొండలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు
నల్గొండ: నల్గొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. నల్గొండలోని అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఆయన పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి హాజరయ్యారు. జిల్లాలోని 58 మంది అమరవీరుల కుటుంబాలకు మంత్రి జగదీశ్‌రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. -
విద్యుత్ శాఖ మంత్రి పై అవినీతి విచారణ
చెన్నై: తమిళనాడు ప్రభుత్వ విద్యుత్ శాఖ మంత్రి నత్తం విశ్వనాథన్ రూ.525 కోట్లు లంచం పుచ్చుకున్నట్లుగా వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాల్సిందిగా అవినీతి నిరోధక శాఖను మద్రాసు హైకోర్టు మంగళవారం ఆదేశించింది. సౌరశక్తి విద్యుత్ కొనుగోలులో అదానీ గ్రూపు సంస్థలతో మంత్రి నత్తం విశ్వనాథన్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపిస్తూ చెన్నై కొట్టూరుపురానికి చెందిన శ్రీనివాస్ మద్రాసు హైకోర్టులో ఇటీవల ఒక పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాడు విద్యుత్ బోర్డు వారు సౌర విద్యుత్ కొనుగోలుకు యూనిట్ రూ.6.48లు చెల్లించేలా ఒప్పందం చేసుకోగా, వాస్తవానికి ప్రభుత్వం రూ.7.01 చెల్లిస్తోందని తెలిపారు. సౌరశక్తి విద్యుత్‌కు ఇతర రాష్ట్రాలు యూనిట్‌కు రూ.5.01 చెల్లిస్తుండగా, తమిళనాడు రెండు రూపాయలు అదనంగా చెల్లిస్తోందని చెప్పారు . రామనాథపురం జిల్లాలో అదానీగ్రూపు సంస్థల వారు అధిక సంఖ్యలో సౌరశక్తి ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకే రూ.2 ఎక్కువగా చెల్లిస్తున్నారని ఆరోపించారు. అదానీ గ్రూపు సంస్థలతో పాటు ఇతర సౌరశక్తి ఉత్పత్తిదారుల నుంచి మంత్రి నత్తం విశ్వనాథన్ ఒక మెగావాట్ విద్యుత్‌కు రూ.35 లక్షల నుంచి రూ.40లక్షల వరకు లంచం పుచ్చుకున్నారని పిటిషన్లో పేర్కొన్నాడు. ఇలా అనేక విద్యుత్ సంస్థల నుంచి మంత్రి నత్తం రూ.525 కోట్లు లంచం పుచ్చుకున్నారని ఆయన ఆరోపించారు . మంత్రి నత్తం అవినీతి కార్యకలాపాలపై గత నెల ఒకటో తేదీన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినా విచారణ ప్రారంభించలేదని కోర్టుకు తెలిపారు. అందువల్ల కోర్టుకు సమర్పించిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించి ఏసీబీకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పిటిషన్ పై జూన్ రెండో వారంలోగా విచారణ జరిపి కోర్టుకు నివేదిక సమర్పించాల్సిందిగా న్యాయమూర్తి పి.దేవదాస్ ఏసీబీ అధికారులను ఆదేశించారు. -
జిల్లాను హరితవనంగా మార్చాలి
బొల్లేపల్లి(భువనగిరి అర్బన్) హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాను హరితవనంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చే యాలని విద్యుత్‌శాఖ మంత్రి గుంతగండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆది వారం మండలంలోని బొల్లేపల్లి గ్రా మంలో గల ప్రథమిక ఆరోగ్య కేం ద్రంలో, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవరకొండ, మునుగోడు, భు వనగిరి, ఆలేరు ప్రాంతాల్లో అడవులు, చెట్లు లేకపోవడంతో కరువు ప్రాంతాలుగా మారే ప్రమాదం ఉం దన్నారు. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉన్న విధంగా మొక్కలను పెంచితే వర్షాలు కురుస్తాయన్నారు. మొక్కలను నాటడమేకాకుండా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. ప్రతి గ్రా మంలో లక్ష నుంచి రెండు లక్షల మొ క్కలను పెంచాలన్నారు. రెండు రోజుల్లో 10 లక్షల మొక్కలను నాటామని, ఆదివారం సుమారు 5 లక్షల మొక్కలను నాటినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 4 కోట్ల 80 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యాంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, వేముల విరేశం, కుసుకుంట్ల ప్రభాకర్, జేసీ సత్యనారాయణ, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, ఆర్డీఓ ఎన్. మధుసూదన్, డీఎస్పీ ఎస్. మోహన్‌రెడ్డి, ఎంపీపీ తోట కూర వెంకటేష్‌యాదవ్, జెడ్పీటీసీ సందెల సుధాకర్, వైఎస్ ఎంపీపీ ఎం. శ్రీనివాస్, ఎంపీడీఓ ఎం. సరస్వతి, గ్రామ సర్పంచ్ గోద శ్రీనివాస్‌గౌడ్, అబ్బగాని వెంకట్‌గౌడ్, జీలుగు సతీష్‌పవన్, ఎంపీటీసీ జిన్న మల్లేష్, చింతల శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, పట్టణ, మండల అధ్యక్షులు కె.అమరేందర్, మారగోని రాముగౌడ్, సింగిల్‌విండో చైర్మన్ ఎండ్ల సత్తిరెడ్డి, నాయకులు జనగాం పాండు, చిన్న శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఆస్పత్రి వైద్యులు పద్మ, సిబ్బంది పాల్గొన్నారు. -
ట్రాన్స్ ఫార్మర్
కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వరు... కాలిపోయిన వాటికి మరమ్మతులు చేయరు ఆమ్యామ్యాలు ముట్టనిదే రైతుకు ట్రాన్స్ఫార్మర్ రానట్టే గత ఏడాది మామూళ్లు రూ.7.5 కోట్లపైనే ఉంటాయని అంచనా ఒక్కో దానికి రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు కొత్తవి పెట్టకపోవడంతో పాత వాటిపై ఓవర్‌లోడ్ మరమ్మతులకు వచ్చిన ట్రాన్స్ఫార్మర్లకూ మోక్షం లేదు నాలుగు గంటల్లో మరమ్మతు చేసి ఇవ్వాలన్న మంత్రి ఆదేశాలూ బేఖాతరు సీజన్ మొదలయితే మరింత పెరగనున్న కరెంటు కష్టాలు ‘విద్యుత్ శాఖ మంత్రిగా జిల్లా నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా. ఈ జిల్లాలో రైతులు ట్రాన్స్ఫార్మర్ల కోసం ఇబ్బం దులు పడకూడదు. గతంలో విద్యుత్ శాఖ అధికారులు ఎలా పనిచేసినా, ఇప్పుడు పనితీరు మార్చుకోవాలి. అవినీతిని దగ్గరకు రానీయవద్దు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయండి. రైతు అడిగిన 4 గంటల్లో ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాల్సిందే.’ఇటీవల జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివి.అయినా పరిస్థితిలో మార్పులేదు. మంత్రి ఆదేశాలు కూడా అమలు కావడం లేదు. ట్రాన్సఫార్మర్ల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని, రైతాంగానికి ఎట్టి పరిస్థితుల్లో కరెంటు కష్టాలు రానిచ్చే ప్రసక్తే లేదని ప్రభుత్వ పెద్దలు చెపుతున్న మాటలు, వారు కంటున్న కలలు నెరవేరే పరిస్థితి జిల్లాలో కనిపించడం లేదు. తన పొలంలో మానెడు పోసి కుండెడు దెవులాడుకునే అన్నదాత విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంతో కరెంటు కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. విద్యుత్ సరఫరాను నియంత్రించేందుకు గాను జిల్లాలో అవసరమైన కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడంలో విద్యుత్ శాఖ సిబ్బంది కాసుల కక్కుర్తి, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతులు చేయడంలోనూ నిర్లక్ష్యం.. వెరసి రైతుకు కావాల్సిన విద్యుత్ అందని పరిస్థితి నెలకొంది. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావస్తున్న దశలో కూడా జిల్లాలోని విద్యుత్ యంత్రాంగం ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తుండడంతో భవిష్యత్తులో జిల్లా రైతాంగానికి పెద్ద ఎత్తున కరెంటు కష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా నుంచి విద్యుత్ శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి ఇటీవల విద్యుత్ అధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో మరమ్మతుకు వచ్చిన 4 గంటల్లో రైతుకు ట్రాన్స్ఫార్మర్ ఇచ్చేయాలని చెప్పిన ఆదేశాలు కూడా అమలు కావడం లేదు. రోజుల తరబడి ప్రదక్షిణలు చేసినా ఫలితం ఉండడం లేదు. పైగా మంత్రి ఆదేశాలు ఎలా పాటిస్తామని, సాధ్యమయ్యే పని కాదని విద్యుత్ శాఖ అధికారులే లోలోన వాదులాడుకుంటున్నట్టు సమాచారం. కొత్త.. పాత ఏదయినా అంతే.. జిల్లాలో మొత్తం 3.70లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఈ కనెక్షన్ల ద్వారా రైతులు విద్యుత్ సహాయంతో తమ పొలాలు పండించుకుంటున్నారు. అయితే, ఈ విద్యుత్ సరఫరాలో అత్యంత కీలకపాత్ర ట్రాన్స్‌ఫార్మర్‌దే. ట్రాన్స్ఫార్మర్ లేనిదే ఎంత విద్యుత్ వచ్చినా రైతుకు బూడిదలో పోసిన పన్నీరు లాంటిదే. ఈ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటులో విద్యుత్ శాఖ సిబ్బంది తీరు విమర్శలకు దారి తీస్తోంది. కొత్త ట్రాన్స్ఫార్మర్ కావాలని రైతు డీడీ తీసిన దగ్గరి నుంచి ఆ రైతు పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు నెలలు, సంవత్సరాలు పడుతోంది. గత ప్రభుత్వాల హయాంలో ఎలా ఉన్నా... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రైతుల ట్రాన్స్ఫార్మర్ కష్టాలు కడతేరడం లేదు. కొత్తవాటిని ఏర్పాటు చేయాలంటే విద్యుత్ సిబ్బంది చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని, వేల రూపాయలు ముట్టజెప్పాల్పి వస్తోందని రైతులు వాపోతున్నారు. మరోవైపు ట్రాన్స్ఫార్మర్లతో పాటు లోవోల్టేజీ కారణంగా వ్యవసాయ మోటార్లు కూడా కాలిపోతుండడం రైతుకు గోరుచుట్టపై రోకటి పోటు చందంగా తయారయింది. కొత్త ట్రాన్స్ఫార్మర్ల పరిస్థితి అలా ఉంటే కాలిపోయిన వాటిని మరమ్మతు చేసే విషయంలో విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి మరమ్మతుకు వచ్చిన ట్రాన్స్ఫార్మర్ సమస్యను 48 గంటల్లో పరిష్కరించాల్సి ఉన్నా.. అది జరగడం లేదు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను ఎస్పీఎం సెంటర్‌కు తీసుకెళ్లి మరమ్మతు చేయించి మళ్లీ రైతు పొలంలో ఏర్పాటు చేసేందుకు వాహనాలు ప్రభుత్వమే సమకూర్చినా ఆ భారం కూడా రైతుల పైనే అధికారులు వేస్తున్నారు. కాలిపోయిన దానికి తీసుకెళ్లడానికి ఒక రోజు, మరమ్మతు అయిన దానిని తీసుకెళ్లేందుకు మరో రోజు రైతుకు వేల రూపాయల కిరాయి భారమవుతోంది. వీటన్నింటి నేపథ్యంలో ఇటీవలి సమీక్ష సమావేశంలో మరమ్మతుకు వచ్చిన ట్రాన్స్ఫార్మర్ను 4 గంటల్లో రైతుకు ఇచ్చేయాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ, అది అమలు కావడం లేదు. పైగా, ఆ తర్వాత జరిగిన విద్యుత్ శాఖ అధికారుల అంతర్గత సమావేశంలో కొందరు అధికారులు మంత్రి చెప్పిన విధంగా తాము చేయలేమని ఉన్నతాధికారుల ముందు చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారుల మధ్య వాగ్వాదం జరిగిందని సమాచారం. జెడ్పీ చైర్మన్ స్వగ్రామంలోనే తిప్పలు కరెంటోళ్ల పనితీరుకు ఇది ఓ చక్కటి ఉదాహరణ. జిల్లాపరిషత్ అధ్యక్షుడి సొంత గ్రామంలో కూడా ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు విషయంలో రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. జిల్లాపరిషత్ చైర్మన్ బాలునాయక్ సొంత గ్రామపంచాయతీ ముదిగొండ పరిధిలోనికి వచ్చే వడ్త్య తండాలో దాదాపు నెల రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ కాలిపోగా ఎన్నిసార్లు ఏకరువు పెట్టుకున్నా మార్చడం లేదని ఆ తండాకు చెందిన జైపాల్ అనే రైతు పేరిట20 రోజుల క్రితం ‘సాక్షి’కి ఫోన్లో ఫిర్యాదు చేశాడు. అయితే రోజుల తరబడి తిప్పుకున్న అధికారులు నాలుగు రోజుల క్రితం మరమ్మతులు చేసి ఏర్పాటు చేసినట్లు సమాచారం. రూ.కోట్లు దాటుతున్న ఆమ్యామ్యాలు రైతుల కష్టాలు అలా ఉంటే విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది లంచాలుగా తీసుకుంటున్న మొత్తం రూ.కోట్లు దాటుతాయనే ఆరోపణలు వస్తున్నాయి. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 5వేల కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయగా, వాటికి ఆమ్యామ్యాల కింద ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు సగటున రూ.15వేల చొప్పున రూ.7.5కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ సిబ్బందికి ముట్టిందని అంచనా. దీనికి తోడు కరెంటు పోల్స్, వైర్లు, ఇతర ఖర్చుల నిమిత్తం రైతుపై ఒక్కో ట్రాన్స్ఫార్మర్కు రూ.2లక్షల వరకు అదనపు భారం పడుతోంది. ఇంత ఖర్చు చేసినా రైతుకు మాత్రం సకాలంలో ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో ఉండడం లేదు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 5,600 ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉండగా, అందులో 1,600 ట్రాన్స్ఫార్మర్లకు మాత్రమే వర్క్ ఆర్డర్లు ఇచ్చారు. అయితే, కొత్త ట్రాన్స్ఫార్మర్ల మంజూరు నుంచి ఏర్పాటు వరకు విద్యుత్ శాఖ సిబ్బందికి ముట్టచెప్పాల్సిందే. ఎంతగా అంటే.. జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేతికి చిక్కుతున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ భాగం విద్యుత్ శాఖ సిబ్బందే. ఇటీవల నకిరేకల్ ప్రాంతానికి చెందిన ఓ అధికారి.. రైతు పేరిట ట్రాన్స్ఫార్మర్ మెటీరియల్ డ్రా చేసి రైతుకు ఇవ్వకపోవడంతో ఆయన ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ కూడా దర్యాప్తు జరిపి సదరు ఉద్యోగిని సస్పెండ్ చేయాలని సిఫారసు చేయడం గమనార్హం. ఇంకో విశేషమేమిటంటే...తెలంగాణలో అత్యధికంగా జీతాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా విద్యుత్ శాఖ సిబ్బందే. -
'టీడీపీలో దొంగలా దూరాడు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మహానాడు పెడితే డ్వాక్రా మహిళలు చీపుర్లతో కొడతారని సీఎం చంద్రబాబు భయపడుతున్నారని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవ చేశారు. ఆ భయంతోనే మహానాడును హైదరాబాద్‌లో నిర్వహించాలని ఆయన నిర్ణయించారని విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌లో జగదీశ్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.... తెలంగాణలో మిగులు బడ్జెట్‌కు చంద్రబాబే కారణమైతే... ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు మిగులు బడ్జెట్ సాధించలేకపోతున్నారని ప్రశ్నించారు. తన దగ్గర కేసీఆర్ పని చేశాడంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జగదీశ్‌రెడ్డి ఈ సందర్భంగా స్పందించారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి కేసీఆర్ ఆ పార్టీలోనే కొనసాగారని... కానీ చంద్రబాబు మాత్రం టీడీపీలోకి మధ్యలో దొంగలా దూరాడని అన్నారు. 1983లో చంద్రబాబు ఏ పార్టీ నుంచి పోటీ చేసింది అందరికి తెలిసిందేనని ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. చెట్టు కింద కుర్చొని అయిన పరిపాలన చేస్తానని చెప్పిన చంద్రబాబు... ఆంధ్ర బంకర్లలో ఉండి కూడా ఉండి పాలన చేయలేరని చెప్పారు. చంద్రబాబుది లీకుల బతుకని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు.