మెరుగైన విద్యుత్‌ అందిస్తాం | Balineni Srinivas About Power Department | Sakshi
Sakshi News home page

మెరుగైన విద్యుత్‌ అందిస్తాం

Published Mon, Jun 10 2019 1:19 PM | Last Updated on Mon, Jun 10 2019 1:19 PM

Balineni Srinivas About Power Department - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అన్ని వర్గాల వారికి మెరుగైన విద్యుత్‌ను అందిస్తామని విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కొన్ని సంస్థల నుంచి విద్యుత్‌ శాఖకు రూ.1000 కోట్లకు పైగా రావాల్సిన బకాయిలు త్వరలోనే వసూలు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన చోట్ల 33/11కేవీ తో పాటు 132/33 కేవీ సబ్‌స్టేషన్‌లను నిర్మించి విద్యుత్‌ కొరత లేకుండా చూస్తామని బాలినేని చెప్పారు. తీర ప్రాంతాల్లో పాత విద్యుత్‌ లైన్లను మార్చి కొత్త లైన్లను ఏర్పాటు చేస్తామన్నారు. రొయ్యల చెరువులు, ఉప్పుకొటార్లు ఉన్న ప్రాంతాల్లో తరచూ లైన్లు దెబ్బతింటూ విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతోందన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పాతలైన్లను మార్చే ప్రయత్నం చేయలేదన్నారు. ప్రజలకు సక్రమంగా విద్యుత్‌ అందించేందుకు పాతలైన్లను మార్చివేస్తామని మంత్రి చెప్పారు. ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న 10 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్లను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. పశ్చిమ ప్రాంతంలో చాలా చోట్ల విద్యుత్‌ సరఫరా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అవసరమైన చోట్ల మరిన్ని సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి బాలినేనితెలిపారు. ఎన్ని కోట్లు ఖర్చైనా రాష్ట్ర వ్యాప్తంగా హై ఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ (హెచ్‌వీడీఎస్‌)ను పూర్తి చేసి రైతులకు మెరుగైన విద్యుత్‌ను అందిస్తామన్నారు. ప్రకాశం జిల్లాలో రూ.200 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్న హెచ్‌వీడీఎస్‌ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. రైతులకు ఇవ్వాల్సిన వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లను వెంటనే మంజూరు చేస్తామని బాలినేని చెప్పారు. రైతులతో పాటు అన్ని వర్గాలపై అదనపు విద్యుత్‌ చార్జీల భారం లేకుండా చూస్తామన్నారు. అన్ని రకాల పరిశ్రమలకు సకాలంలో విద్యుత్‌ సర్వీసులు ఇచ్చి విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు. రాష్ట్రంలో  పవన విద్యుత్‌కు ప్రాధాన్యత ఇచ్చి మరిన్ని చోట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నట్లు మంత్రి బాలినేని చెప్పారు.

ఎర్రచందనాన్ని కాపాడుతాం:
రాష్ట్రంలోని నల్లమల, శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనాన్ని కాపాడుతామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు ఎర్రచందనాన్ని అక్రమంగా నరికి పెద్ద ఎత్తున స్మగ్లింగ్‌కు పాల్పడ్డారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని అరుదైన సంపదైన ఎర్రచందనాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆయన చెప్పారు. ఎర్రచందనాన్ని కాపాడేందుకు మరింత కట్టుదిట్టంగా చర్యలు చేపడతామన్నారు. అటవీ శాఖ అధికారులతో పాటు టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లను మరింత బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అటవీశాఖలో ఖాళీగా ఉన్న 3 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అటవీ ప్రాంతాల్లో పనిచేసేందుకు తక్కువ వయసున్న వారిని నియమిస్తామన్నారు. ఎర్రచందనం ప్లాంటేషన్‌లు ఏర్పాటు చేస్తామని బాలినేని చెప్పారు. ఉన్న ఎర్రచందనాన్ని గ్లోబల్‌ టెండర్స్‌ ద్వారా అమ్మకానికి పెట్టి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుతామన్నారు. స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ శాఖాధికారులు చందనాన్ని కాపాడే విధంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.

అడవుల అభివృద్ధితో పర్యావరణాన్ని కాపాడుతాం :
అడవులను అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని బాలినేని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మొక్కల పెంపకం, అటవీ అభివృద్ధి కాగితాల్లో లెక్కలకే పరిమితమైందని విమర్శించారు. ఇప్పుడు అలా కాకుండా లక్ష్యాలు నిర్దేశించుకుని అడవులను సంరక్షిస్తామన్నారు. అటవీ శివారు ప్రాంతాల్లో  మొక్కల ప్లాంటేషన్‌లు, పశుగ్రాసాలు, వంటచెరకు పెంచి ప్రజలు ముఖ్యంగా గిరిజనులు అడవుల్లోకి వెళ్లి చెట్లు నరకకుండా చర్యలు చేపడతామని చెప్పారు. అటవీ ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు. దీంతో పాటుగా వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్న ఎకో టూరిజంను మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి బాలినేని తెలిపారు. అడవుల పరిరక్షణతో వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి చెప్పారు. పశ్చిమ ప్రాంత వరప్రదాయిని అయిన వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేసి జిల్లా ప్రజలకు సాగు, తాగునీరు అందిస్తామని చెప్పారు. ఇవే కాక జిల్లాకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement