ఏం టైమింగ్.. పవర్ మంత్రికి భలే అనుభవం
వారణాసి: ఆహా.. ఏం టైమింగ్ అని సాధారణంగా అంటుంటాం. ఎవరి గురించి మాట్లాడుతామో.. ఏ విషయం గురించి చర్చిస్తామో దాన్ని ప్రతిబింబించేలా ఆవ్యక్తి వచ్చినప్పుడుగానీ, ఆ విషయం తాలూకు ఆనవాళ్లు కనిపించినప్పుడు ఈ టైమింగ్ అనే డైలాగ్‌ను ఉపయోగిస్తుంటాం. సరిగ్గా నిజంగా ఏం టైమింగ్ అన్నట్లుగా కేంద్ర మంత్రి ఉన్నచోట ఏర్పడిన పరిస్థితిని చూసి అక్కడి వారంతా అనుకున్నారు. ఇంతకీ ఎవరా కేంద్రమంత్రి? ఏం సంఘటన అక్కడ జరిగిందని అనుకుంటున్నారా? ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
బీజేపీ తరుపున ప్రచారంలో పాల్గొన్న కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి పీయూష్ గోయల్ అనంతరం పత్రికా సమావేశంలో మాట్లాడేందుకు వచ్చారు. సరిగ్గా ఆయన మాట్లాడుతుండగానే పుటుక్కున కరెంట్ పోయింది. లైట్లు ఆగిపోయాయి. అది కూడా సరిగ్గా విద్యుత్ అంశంపై మాట్లాడుతుండగానే కావడంతో అక్కడ ఉన్నవారంతా ఏం టైమింగ్ మంత్రిగారిది అని గుసగుసలాడారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఉపయోగిస్తున్న అస్త్రాల్లో విద్యుత్ సమస్య కూడా ఒకటి. తాము అధికారంలోకి వస్తే కరెంట్ సమస్యే ఉండదని, పూర్తి స్థాయిలో విద్యుత్‌ను అందిస్తామని ఆయన హామీ ఇస్తున్న సమయంలోనే లైట్లు ఆగిపోవడంతో అందరు బిత్తరపోయి నవ్వుకున్నారు.
అయితే, తాను చీకట్లోనే ప్రెస్ మీట్ నిర్వహించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ సమాజ్‌వాది పార్టీపై విమర్శలు చేశారు. విద్యుత్ అందరికీ సమానంగా అందించాలని, ఇలా అంతరాయం కలిగిస్తూ కొన్ని ప్రాంతాలకే పూర్తి సహాయం చేస్తే ఎలా అని ఆయన నిలదీశారు. ‘నేను నా గురించి ఆందోళన చెందడం లేదు.. బాధపడటం లేదు. నేను కాలేజీల్లో, పాఠశాలల్లో చదివే విద్యార్థుల గురించి ఫీలవుతున్నాను. రైతుల గురించి, ఆస్పత్రిలో వైద్యం చేస్తున్న వైద్యుల గురించి, రోగుల గురించి ఆందోళన చెందుతున్నాను’ అని గోయల్ అన్నారు.