
స్పష్టం చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: చైనా అసమంజస వాణిజ్య విధానాలపై విమర్శల నేపథ్యంలో చైనీస్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం బీవైడీ భారత్‌లో పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనలకు ప్రస్తుతం ఆమోదముద్ర లభించే అవకాశాలు కనిపించడం లేదు. ‘దేశ వ్యూహాత్మక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎవరి పెట్టుబడులను అనుమతించాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతానికి బీవైడీ ప్రతిపాదనకు నో (చెప్పినట్లే)’ అని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
స్థానిక భాగస్వామితో కలిసి 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తామంటూ బీవైడీ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం గతేడాది తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయం మళ్లీ ముందుకు కదిలినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ప్రభుత్వం ప్రధానంగా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుందని దుబాయ్ ఇండియా బిజినెస్ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గోయల్ చెప్పారు.
వివిధ దేశాలతో ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపిన గోయల్.. అమెరికాతో చర్చలు సానుకూల దిశలోనే సాగుతున్నాయని చెప్పారు. యూఏఈలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విద్యా సంస్థలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆయన వివరించారు.