ట్రాన్స్ ఫార్మర్ | trans formers | Sakshi
Sakshi News home page

ట్రాన్స్ ఫార్మర్

Published Sat, Jun 27 2015 11:37 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

trans formers

కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వరు... కాలిపోయిన వాటికి మరమ్మతులు చేయరు
 ఆమ్యామ్యాలు ముట్టనిదే రైతుకు ట్రాన్స్‌ఫార్మర్ రానట్టే
 గత ఏడాది మామూళ్లు రూ.7.5 కోట్లపైనే ఉంటాయని అంచనా
 ఒక్కో దానికి రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు
 కొత్తవి పెట్టకపోవడంతో పాత వాటిపై ఓవర్‌లోడ్
 మరమ్మతులకు వచ్చిన ట్రాన్స్‌ఫార్మర్లకూ మోక్షం లేదు
 నాలుగు గంటల్లో మరమ్మతు చేసి ఇవ్వాలన్న మంత్రి ఆదేశాలూ బేఖాతరు
 సీజన్ మొదలయితే మరింత పెరగనున్న కరెంటు కష్టాలు
 
 ‘విద్యుత్ శాఖ మంత్రిగా జిల్లా నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా. ఈ జిల్లాలో రైతులు ట్రాన్స్‌ఫార్మర్ల కోసం ఇబ్బం దులు పడకూడదు. గతంలో విద్యుత్ శాఖ అధికారులు ఎలా పనిచేసినా, ఇప్పుడు పనితీరు మార్చుకోవాలి. అవినీతిని దగ్గరకు రానీయవద్దు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయండి. రైతు అడిగిన 4 గంటల్లో ట్రాన్స్‌ఫార్మర్ ఇవ్వాల్సిందే.’ఇటీవల జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివి.అయినా పరిస్థితిలో మార్పులేదు. మంత్రి ఆదేశాలు కూడా అమలు కావడం లేదు.  ట్రాన్‌‌సఫార్మర్ల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు.
 
 సాక్షి ప్రతినిధి, నల్లగొండ
 నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని, రైతాంగానికి ఎట్టి పరిస్థితుల్లో కరెంటు కష్టాలు రానిచ్చే ప్రసక్తే లేదని ప్రభుత్వ పెద్దలు చెపుతున్న మాటలు, వారు కంటున్న కలలు నెరవేరే పరిస్థితి జిల్లాలో కనిపించడం లేదు. తన పొలంలో మానెడు పోసి కుండెడు దెవులాడుకునే అన్నదాత విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంతో కరెంటు కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. విద్యుత్ సరఫరాను నియంత్రించేందుకు గాను జిల్లాలో అవసరమైన కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయడంలో విద్యుత్ శాఖ సిబ్బంది కాసుల కక్కుర్తి, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను మరమ్మతులు చేయడంలోనూ నిర్లక్ష్యం.. వెరసి రైతుకు కావాల్సిన విద్యుత్ అందని పరిస్థితి నెలకొంది.
 
 వ్యవసాయ సీజన్ ప్రారంభం కావస్తున్న దశలో కూడా జిల్లాలోని విద్యుత్ యంత్రాంగం ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తుండడంతో భవిష్యత్తులో జిల్లా రైతాంగానికి పెద్ద ఎత్తున కరెంటు కష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా నుంచి విద్యుత్ శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి ఇటీవల విద్యుత్ అధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో మరమ్మతుకు వచ్చిన 4 గంటల్లో రైతుకు ట్రాన్స్‌ఫార్మర్ ఇచ్చేయాలని చెప్పిన ఆదేశాలు కూడా అమలు కావడం లేదు. రోజుల తరబడి ప్రదక్షిణలు చేసినా ఫలితం ఉండడం లేదు. పైగా మంత్రి ఆదేశాలు ఎలా పాటిస్తామని, సాధ్యమయ్యే పని కాదని విద్యుత్ శాఖ అధికారులే లోలోన వాదులాడుకుంటున్నట్టు సమాచారం.
 
 కొత్త.. పాత ఏదయినా అంతే..
 జిల్లాలో మొత్తం 3.70లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఈ కనెక్షన్ల ద్వారా రైతులు విద్యుత్ సహాయంతో తమ పొలాలు పండించుకుంటున్నారు. అయితే, ఈ విద్యుత్ సరఫరాలో అత్యంత కీలకపాత్ర ట్రాన్స్‌ఫార్మర్‌దే. ట్రాన్స్‌ఫార్మర్ లేనిదే ఎంత విద్యుత్ వచ్చినా రైతుకు బూడిదలో పోసిన పన్నీరు లాంటిదే. ఈ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటులో విద్యుత్ శాఖ సిబ్బంది తీరు విమర్శలకు దారి తీస్తోంది. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ కావాలని రైతు డీడీ తీసిన దగ్గరి నుంచి ఆ రైతు పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు నెలలు, సంవత్సరాలు పడుతోంది. గత ప్రభుత్వాల హయాంలో ఎలా ఉన్నా... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రైతుల ట్రాన్స్‌ఫార్మర్ కష్టాలు కడతేరడం లేదు. కొత్తవాటిని ఏర్పాటు చేయాలంటే విద్యుత్ సిబ్బంది చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని, వేల రూపాయలు ముట్టజెప్పాల్పి వస్తోందని రైతులు వాపోతున్నారు.
 
 మరోవైపు ట్రాన్స్‌ఫార్మర్‌లతో పాటు లోవోల్టేజీ కారణంగా వ్యవసాయ మోటార్లు కూడా కాలిపోతుండడం రైతుకు గోరుచుట్టపై రోకటి పోటు చందంగా తయారయింది. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల పరిస్థితి అలా ఉంటే కాలిపోయిన వాటిని మరమ్మతు చేసే విషయంలో విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి మరమ్మతుకు వచ్చిన ట్రాన్స్‌ఫార్మర్ సమస్యను 48 గంటల్లో పరిష్కరించాల్సి ఉన్నా.. అది జరగడం లేదు. కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎస్‌పీఎం సెంటర్‌కు తీసుకెళ్లి మరమ్మతు చేయించి మళ్లీ రైతు పొలంలో ఏర్పాటు చేసేందుకు వాహనాలు ప్రభుత్వమే సమకూర్చినా ఆ భారం కూడా రైతుల పైనే అధికారులు వేస్తున్నారు.
 
 కాలిపోయిన దానికి తీసుకెళ్లడానికి ఒక రోజు, మరమ్మతు అయిన దానిని తీసుకెళ్లేందుకు మరో రోజు రైతుకు వేల రూపాయల కిరాయి భారమవుతోంది. వీటన్నింటి నేపథ్యంలో ఇటీవలి సమీక్ష సమావేశంలో మరమ్మతుకు వచ్చిన ట్రాన్స్‌ఫార్మర్‌ను 4 గంటల్లో రైతుకు ఇచ్చేయాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ, అది అమలు కావడం లేదు. పైగా, ఆ తర్వాత జరిగిన విద్యుత్ శాఖ అధికారుల అంతర్గత సమావేశంలో కొందరు అధికారులు మంత్రి చెప్పిన విధంగా తాము చేయలేమని ఉన్నతాధికారుల ముందు చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారుల మధ్య వాగ్వాదం  జరిగిందని సమాచారం.
 
 జెడ్పీ చైర్మన్ స్వగ్రామంలోనే తిప్పలు
 కరెంటోళ్ల పనితీరుకు ఇది ఓ చక్కటి ఉదాహరణ. జిల్లాపరిషత్ అధ్యక్షుడి సొంత గ్రామంలో కూడా ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు విషయంలో రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. జిల్లాపరిషత్ చైర్మన్ బాలునాయక్ సొంత గ్రామపంచాయతీ ముదిగొండ పరిధిలోనికి వచ్చే వడ్త్య తండాలో దాదాపు నెల రోజుల క్రితం ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోగా  ఎన్నిసార్లు ఏకరువు పెట్టుకున్నా మార్చడం లేదని ఆ తండాకు చెందిన జైపాల్ అనే రైతు పేరిట20 రోజుల క్రితం ‘సాక్షి’కి ఫోన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే రోజుల తరబడి తిప్పుకున్న అధికారులు నాలుగు రోజుల క్రితం మరమ్మతులు చేసి ఏర్పాటు చేసినట్లు సమాచారం.
 
 రూ.కోట్లు దాటుతున్న ఆమ్యామ్యాలు
 రైతుల కష్టాలు అలా ఉంటే విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది లంచాలుగా తీసుకుంటున్న మొత్తం రూ.కోట్లు దాటుతాయనే ఆరోపణలు వస్తున్నాయి. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 5వేల కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయగా, వాటికి ఆమ్యామ్యాల కింద ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌కు సగటున రూ.15వేల చొప్పున రూ.7.5కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ సిబ్బందికి ముట్టిందని అంచనా. దీనికి తోడు కరెంటు పోల్స్, వైర్లు, ఇతర ఖర్చుల నిమిత్తం రైతుపై ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ.2లక్షల వరకు అదనపు భారం పడుతోంది. ఇంత ఖర్చు చేసినా రైతుకు మాత్రం సకాలంలో ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో ఉండడం లేదు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 5,600 ట్రాన్స్‌ఫార్మర్లు అవసరం ఉండగా, అందులో 1,600 ట్రాన్స్‌ఫార్మర్లకు మాత్రమే వర్క్ ఆర్డర్లు ఇచ్చారు. అయితే, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరు నుంచి ఏర్పాటు వరకు విద్యుత్ శాఖ సిబ్బందికి ముట్టచెప్పాల్సిందే. ఎంతగా అంటే.. జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేతికి చిక్కుతున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎక్కువ భాగం విద్యుత్ శాఖ సిబ్బందే. ఇటీవల నకిరేకల్ ప్రాంతానికి చెందిన ఓ అధికారి.. రైతు పేరిట ట్రాన్స్‌ఫార్మర్ మెటీరియల్ డ్రా చేసి రైతుకు ఇవ్వకపోవడంతో ఆయన ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ కూడా దర్యాప్తు జరిపి సదరు ఉద్యోగిని సస్పెండ్ చేయాలని సిఫారసు చేయడం గమనార్హం. ఇంకో విశేషమేమిటంటే...తెలంగాణలో అత్యధికంగా జీతాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా విద్యుత్ శాఖ సిబ్బందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement