
‘త్వరలో డోక్లామ్ ప్రతిష్టంభన వీడుతుంది’
సాక్షి, న్యూఢిల్లీ : డోక్లామ్ ప్రతిష్టంభనకు తెరపడేలా చైనా త్వరలోనే చర్చలకు ముందుకొస్తుందని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సిక్కిం సరిహద్దు వెంబడి ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితి సమసిపోయేలా సంప్రదింపుల ప్రక్రియకు చైనా చొరవ చూపుతుందని ఆయన సోమవారమిక్కడ అన్నారు. పొరుగు దేశాలన్నింటితో భారత్ శాంతియుత సంబంధాలను ఆకాంక్షిస్తుందని చెప్పారు.
భారత్ శాంతినే కోరుకుంటుందనే సందేశాన్ని పొరుగు దేశాలకు చాటుతున్నామన్నారు. డోక్లాంపై మూడు నెలలుగా భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు, పరస్పర హెచ్చరికలతో ప్రతిష్టంభన నెలకొన్న క్రమంలో హోంమంత్రి రాజ్‌నాథ్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు భారత్‌తో భారీగా వాణిజ్య సంబంధాలు నెరపడం, ఆర్థిక శక్తిగా అమెరికాకు దీటుగా ఎదగాలని భావిస్తుండటంతో చైనా దూకుడుగా వెళ్లబోదని భావిస్తున్నారు.