
ఛత్తీస్‌గఢ్‌లో చర్చిపై దాడి
♦ బైబిల్, ఇతర వస్తువులకు నిప్పు
♦ పాస్టర్, ఆయన గర్భిణి భార్యపైనా దాడి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బస్తర్ జిల్లాలోని ఓ చర్చిలోకి చొరబడిన ఇద్దరు సాయుధులు విధ్వంసం సృష్టించారు. బైబిల్‌తోపాటు ఇతర వస్తువుల్ని తగులపెట్టడమేగాక పాస్టర్‌పైన, ఆయన గర్భిణి భార్యపైనా దాడికి పాల్పడ్డారు. వారిద్దరినీ చితకబాదారు. ఈ ఘటన పర్పా పోలీస్‌స్టేషన్ పరిధిలోని కరంజి మటగుడి పారా గ్రామంలో ఆదివారం చోటు చేసుకోగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు.. వేరొక క్రైస్తవ సంఘానికి చెందినవారమని చెప్పుకుంటూ చర్చిలో ప్రార్థన చేయాలన్న కోరికను వ్యక్తీకరించారు. లోనికి వచ్చిన వెంటనే పాస్టర్‌పై దాడికి దిగారు. తమ వెంట తెచ్చిన పెట్రోల్‌ను బైబిల్‌పైన, ఫర్నిచర్‌పైన, ఇతర మతసంబంధిత వస్తువులపైన పోసి తగులపెట్టారు పాస్టర్‌ను, ఆయన గర్భిణి భార్యనూ చితకబాదారు. పాస్టర్ దీనబంధు సమేలి ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు కేసు పెట్టి దుండగుల కోసం గాలిస్తున్నారు.
బజరంగ్‌దళ్ పనే.. ఈ దాడి బజరంగ్‌దళ్ కార్యకర్తల పనేనని ఛత్తీస్‌గఢ్ క్రిస్టియన్ ఫోరం చీఫ్ అరుణ్ పన్నాలాల్ ఆరోపించారు. పోలీసులు దీనిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాంతంలోని క్రైస్తవ మందిరాలపై ఇటీవలి కాలంలో జరిగిన మూడో దాడి ఇదన్నారు. దుండగులు పదునైన ఆయుధాలతో దాడికి పాల్పడ్డారన్నారు.