’మా పిల్లలు బడికెళ్ళేందుకు పుస్తకాలు లేవు. మా కోళ్ళూ, పశువులూ అన్నీ వరదనీటిలో కొట్టుకుపోయాయి. మాకిప్పుడు తలదాచుకునేందుకు ఇంత నీడ లేదు మూడు లక్షలు ఖర్చు పెట్టి కొత్తగా కట్టుకున్న ఇల్లు వరదల్లో పూర్తిగా కొట్టుకుపోయి నిరాశ్రయులుగా పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నాము’’అన్నీ పోగొట్టుకొని ప్రాణాలను మాత్రం చిక్కబట్టుకొని బతికిబయటపడ్డ శోభన ఆవేదన ఇది. ముంచెత్తిన చెత్తాచెదారం మధ్య గుర్తించలేని విధంగా తయారైన తమ ఇళ్ళను చూసుకొని జనం బావురుమంటున్నారు. ప్రళయ బీభత్సం మిగిల్చిన విషాదాన్ని చూసి విలపిస్తున్నారు. పునరావాస కేంద్రం నుంచి ఎర్నాకుళం జిల్లాలోని కొత్తాడ్‌లోని తమ ఇంటికి తిరిగి వెళ్ళిన 68 ఏళ్ళ వృద్ధుడు అక్కడి పరిస్థితిని చూసి జీర్ణించుకోలేక దిగ్భ్రాంతికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డ విషాదం కంటతడిపెట్టించింది.
పునరావాస కేంద్రాల్లోని ప్రజలను తిరిగి సురక్షితంగా తమ ఇళ్ళకు చేర్చాలంటే ముందుగా బహిరంగ ప్రదేశాలనూ, వారి ఇళ్ళనూ శుభ్రపరిచి, నివాసయోగ్యంగా తయారు చేయాలి. కేరళ ప్రభుత్వం ప్రస్తుతం దానిపైనే దృష్టికేంద్రీకరించింది. బావులను శుభ్రపరచడం, పైపులైన్లను పునరుద్ధరించడం, విద్యుత్ పునరుద్ధరణ లాంటి తక్షణావసరాలపైన ప్రభుత్వం దృష్టిసారించింది.
ఇళ్ళను శుభ్రపరిచేపనిలో వేలాది మంది వాలంటీర్లు...
స్థానిక స్వయంపాలన, ఆరోగ్య విభాగాల కింద దాదాపు 3000 కిపైగా బృందాలు ఇళ్ళను శుభ్రపరిచే పనిలో నిమగ్నమయ్యాయి. వీళ్ళు కాకుండా ఇప్పటికే దాదాపు 12,000 మంది వాలంటీర్లు ఇదే పనిలో ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఇప్పటికి 12,000 ఇళ్ళను శుభ్రం చేసారు. దాదాపు 3000 పశువుల కళేబరాలను బుధవారం పూడ్చిపెట్టినట్టు అధికారులు వెల్లడించారు.
’’దాదాపు ప్రజలందరినీ రక్షించాం. ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఎవరైనా వరదనీటిలో చిక్కుకుపోయారేమోనని ఇంకా వెతుకుతూనే ఉన్నాం’’ అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. నెల్లిపట్టి, పలక్కాడ్ జిల్లాల్లో మట్టిపెళ్ళలు విరిగిపడి నీటిలో చిక్కుకుపోయిన 11 మందినీ, మరో 15 మందినీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రక్షించినట్టు వెల్లడించారు.
ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు డిమాండ్!
ప్లంబింగ్, ఎలక్ట్రిక్ పనులు చేసేవారికి డిమాండ్ పెరిగింది. కొన్ని బావులు పూర్తిగా వరద బురదతో నిండిపోవడంతో వాటిని శుభ్రపరిచేందుకు ఒక్కొక్కరికీ 15000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రతి వేసవిలో దాదాపు 40 బావులను శుభ్రపరిచే కూనమ్‌తాయ్‌కి చెందిన పికె.కుట్టాన్ బావులు శుభ్రం చేయాలంటూ తనకి చాలా మంది ఫోన్లు చేస్తున్నారని అన్నారు. పెద్దగా లోతులేని చిన్న చిన్న బావులు ఒక్కొక్కదాన్ని శుభ్రపరిచేందుకు 2000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక పెద్ద పెద్ద బావులు శుభ్రపరచడం మరింత రిస్క్‌తో కూడుకున్నదంటున్నారు కుట్టాన్. ’’ముందుగా ఓ క్యాండిల్‌ని వెలిగించి బావిలోకి దింపి, అది ఆరిపోకుండా ఉంటేనే మేం బావిలోనికి దిగుతున్నాం. ఇలా చేయడం వల్ల బావిలోని ఆక్సిజన్‌ని అంచనావేసే అవకాశం ఉంటుంది. లేదంటే కొన్ని సార్లు అది చాలా ప్రమాదకరం’’ అంటారాయన.
త్రీ బెడ్‌రూం ఫ్లాట్‌లో విద్యుత్ పునరుద్ధరణ పనులకు దాదాపు 20,000 ఖర్చు అవుతుందని ఉదయంపెరూర్‌లోని సానోజ్ జోసెఫ్ అన్నారు. ’’ఒక్కో ఇంటికి రెండ్రోజుల పని ఉంటుంది. అదంతా ఫ్రీగా చేయాలంటే సాధ్యంకాదు. మా కుటుంబాలను కూడా పోషించుకోవాలి కదా?’’ అని ప్రశ్నిస్తున్నారు జోసెఫ్.
ఫిక్స్ ఆల్... ఇదిలా ఉంటే ఉచితంగా సేవలందించేందుకు ’’ఫిక్స్ ఆల్’’ అనే ఆన్‌లైన్ వేదికొకటి ఏర్పాటయ్యింది. ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్, రిఫ్రిజిరేటర్లను, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఉచితంగా రిపేర్ చేసి ఇచ్చేందుకు ’ ఫిక్స్ ఆల్’ ఆన్‌లైన్ సహాయకులు లిజి జాన్ బృందం సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment