plumbers
-
లాక్డౌన్ టైం..రిపేర్ ప్రాబ్లం
సాక్షి, సిటీబ్యూరో: కరోనా లాక్డౌన్ గృహోపకరణాల మరమ్మతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్డౌన్లో మినహాయించిన అత్యవసర సేవల్లో గృహోపకరణాలు, వాటి మరమ్మతు షాపులు లేక పోవడం సమస్యగా మారింది. నిరుపేద కుటుంబం నుంచి సంపన్న కుటుంబాల్లో వరకు గృహోపకరణాలు మరమ్మతులకు గురికావడం సర్వసాధారణమే. మరమ్మతు సమస్య చిన్నదైనా..ఐదు నిమిషాల్లో రిపేర్ చేసేదైనా... గృహిణులకు మాత్రం పెద్దదిగా కనిపిస్తోంది. వాటి ప్రభావం దైనందిన జీవనంపై కనిపిస్తోంది. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి ఇంటా ఎలక్ట్రానిక్, ప్లంబర్, గ్యాస్‌స్టౌ, వంటావార్పు పరికరాలు, ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, కూలర్ తదితర ఏదో ఒక మరమ్మతు సమస్య వెంటాడుతూనే ఉంటాయి. వంటవార్పునకు సంబంధించిన పరికరమైతే మహిళల చికాకు అంతా ఇంతా కాదు. కొన్ని సందర్భాల్లో అన్నం, కూరల వంట సైతం కష్టతరంగా మారింది. మరోవైపు లాక్‌డౌన్‌తో పిల్లలు, యువత ఇంటికే పరిమితమైన కారణంగా కాలక్షేపానికి టీవీ, కేబుల్ కనెక్షన్, మొబైల్, ల్యాప్‌టాప్, డెస్క్ టాప్, ఇంటర్నెట్ అత్యవసరం. వాటిలో ఏ ఒక్కటి మొరాయించినా ఇబ్బందే. రిపేర్ చేయించలేం.. కొత్తది కొనలేని పరిస్థితి. అపార్ట్‌మెంట్స్‌లో జటిలం మహా నగరంలోని ఆపార్ట్మెంట్వాసులకు నీరు, డ్రైనేజీ, గృహోపకరణాల రిపేర్ సమస్య మరింత జటిలమై వెంటాడుతోంది. సాధారణంగా నగరంలో బహుళ అంతస్తుల భవన సముదాయాలు అధికం. ఒక్కో భవన సముదాయంలో కనీసం 12 నుంచి 40 కుటుంబాల వరకు నివాసం ఉంటాయి. ఆయా నివాస సముదాయంలోని ఫ్లాట్స్‌లో ఎలాంటి మరమ్మతు వచ్చినా పర్మినెంట్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఇతర మెకానిక్‌లు ఉంటారు. కాల్స్ పై స్పందిస్తూ తక్షణమే సేవలందిస్తుంటారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా వారు కూడా అందుబాటులో లేకుండా పోయారు. ఉదాహరణాకు అపార్ట్‌మెంట్స్‌లో పొరపాటున నీటి మోటార్, డ్రైనేజీ పైప్‌లైన్ సమస్య ఏర్పడితే మరమ్మతుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒక వేళ అందుబాటలో ఉన్న మెకానిక్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్స్లను పిలిపించినా... పాడైపోయిన పరికరం స్థానంలో కొత్తది అమర్చేందుకు సంబంధిత దుకాణాలు మూసివేసి ఉంటుండటంతో సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో అపార్ట్‌మెంట్స్‌లో నీరు, నల్లా లీకేజీలు, డ్రైనేజీ సమస్యలు వెంటాడుతున్నాయని పలువురు ఫ్లాట్వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఉపాధి కోల్పోయిన మెకానిక్‌లు గృహోపకరణాల షాపులు మూత పడటంతో వాటిపై ఆధార పడిన మెకానిక్‌లు ఉపాధి కోల్పోయారు. ఏదైనా వస్తువు పాడైతే వాటి మరమ్మతులకు వినియోగదారులు షాపులను ఆశ్రయిస్తుంటారు. కొందరు గృహోపకరణాలు విక్రయించే షాపుల్లో పనిచేస్తూ , మరి కొందరు స్వయంగా చిన్నచిన్న షాపులు, డబ్బాలు పెట్టుకొని, మరికొందరు ఇంటింటికి వెళ్లి మరమ్మతు పనులు చేస్తుంటారు. లాక్డౌన్ కారణంగా షాపుల మూత పడటంతో కనీసం పని లేకుండా పోయింది. వినియోగదారుల కాల్స్‌పై వెళ్లిన సంబంధిత పరికరం అందుబాటులో లేక, కొనుగోలు చేసేందుకు షాపులు బంద్‌తో సమస్య పరిష్కరించకుండానే ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వస్తోంది. -
ఇక ఇప్పుడు ఆపరేషన్ క్లీన్!
’మా పిల్లలు బడికెళ్ళేందుకు పుస్తకాలు లేవు. మా కోళ్ళూ, పశువులూ అన్నీ వరదనీటిలో కొట్టుకుపోయాయి. మాకిప్పుడు తలదాచుకునేందుకు ఇంత నీడ లేదు మూడు లక్షలు ఖర్చు పెట్టి కొత్తగా కట్టుకున్న ఇల్లు వరదల్లో పూర్తిగా కొట్టుకుపోయి నిరాశ్రయులుగా పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నాము’’అన్నీ పోగొట్టుకొని ప్రాణాలను మాత్రం చిక్కబట్టుకొని బతికిబయటపడ్డ శోభన ఆవేదన ఇది. ముంచెత్తిన చెత్తాచెదారం మధ్య గుర్తించలేని విధంగా తయారైన తమ ఇళ్ళను చూసుకొని జనం బావురుమంటున్నారు. ప్రళయ బీభత్సం మిగిల్చిన విషాదాన్ని చూసి విలపిస్తున్నారు. పునరావాస కేంద్రం నుంచి ఎర్నాకుళం జిల్లాలోని కొత్తాడ్లోని తమ ఇంటికి తిరిగి వెళ్ళిన 68 ఏళ్ళ వృద్ధుడు అక్కడి పరిస్థితిని చూసి జీర్ణించుకోలేక దిగ్భ్రాంతికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డ విషాదం కంటతడిపెట్టించింది. పునరావాస కేంద్రాల్లోని ప్రజలను తిరిగి సురక్షితంగా తమ ఇళ్ళకు చేర్చాలంటే ముందుగా బహిరంగ ప్రదేశాలనూ, వారి ఇళ్ళనూ శుభ్రపరిచి, నివాసయోగ్యంగా తయారు చేయాలి. కేరళ ప్రభుత్వం ప్రస్తుతం దానిపైనే దృష్టికేంద్రీకరించింది. బావులను శుభ్రపరచడం, పైపులైన్లను పునరుద్ధరించడం, విద్యుత్ పునరుద్ధరణ లాంటి తక్షణావసరాలపైన ప్రభుత్వం దృష్టిసారించింది. ఇళ్ళను శుభ్రపరిచేపనిలో వేలాది మంది వాలంటీర్లు... స్థానిక స్వయంపాలన, ఆరోగ్య విభాగాల కింద దాదాపు 3000 కిపైగా బృందాలు ఇళ్ళను శుభ్రపరిచే పనిలో నిమగ్నమయ్యాయి. వీళ్ళు కాకుండా ఇప్పటికే దాదాపు 12,000 మంది వాలంటీర్లు ఇదే పనిలో ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఇప్పటికి 12,000 ఇళ్ళను శుభ్రం చేసారు. దాదాపు 3000 పశువుల కళేబరాలను బుధవారం పూడ్చిపెట్టినట్టు అధికారులు వెల్లడించారు. ’’దాదాపు ప్రజలందరినీ రక్షించాం. ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఎవరైనా వరదనీటిలో చిక్కుకుపోయారేమోనని ఇంకా వెతుకుతూనే ఉన్నాం’’ అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. నెల్లిపట్టి, పలక్కాడ్ జిల్లాల్లో మట్టిపెళ్ళలు విరిగిపడి నీటిలో చిక్కుకుపోయిన 11 మందినీ, మరో 15 మందినీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రక్షించినట్టు వెల్లడించారు. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు డిమాండ్! ప్లంబింగ్, ఎలక్ట్రిక్ పనులు చేసేవారికి డిమాండ్ పెరిగింది. కొన్ని బావులు పూర్తిగా వరద బురదతో నిండిపోవడంతో వాటిని శుభ్రపరిచేందుకు ఒక్కొక్కరికీ 15000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి వేసవిలో దాదాపు 40 బావులను శుభ్రపరిచే కూనమ్తాయ్కి చెందిన పికె.కుట్టాన్ బావులు శుభ్రం చేయాలంటూ తనకి చాలా మంది ఫోన్లు చేస్తున్నారని అన్నారు. పెద్దగా లోతులేని చిన్న చిన్న బావులు ఒక్కొక్కదాన్ని శుభ్రపరిచేందుకు 2000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక పెద్ద పెద్ద బావులు శుభ్రపరచడం మరింత రిస్క్‌తో కూడుకున్నదంటున్నారు కుట్టాన్. ’’ముందుగా ఓ క్యాండిల్ని వెలిగించి బావిలోకి దింపి, అది ఆరిపోకుండా ఉంటేనే మేం బావిలోనికి దిగుతున్నాం. ఇలా చేయడం వల్ల బావిలోని ఆక్సిజన్ని అంచనావేసే అవకాశం ఉంటుంది. లేదంటే కొన్ని సార్లు అది చాలా ప్రమాదకరం’’ అంటారాయన. త్రీ బెడ్రూం ఫ్లాట్‌లో విద్యుత్ పునరుద్ధరణ పనులకు దాదాపు 20,000 ఖర్చు అవుతుందని ఉదయంపెరూర్లోని సానోజ్ జోసెఫ్ అన్నారు. ’’ఒక్కో ఇంటికి రెండ్రోజుల పని ఉంటుంది. అదంతా ఫ్రీగా చేయాలంటే సాధ్యంకాదు. మా కుటుంబాలను కూడా పోషించుకోవాలి కదా?’’ అని ప్రశ్నిస్తున్నారు జోసెఫ్. ఫిక్స్ ఆల్... ఇదిలా ఉంటే ఉచితంగా సేవలందించేందుకు ’’ఫిక్స్ ఆల్’’ అనే ఆన్లైన్ వేదికొకటి ఏర్పాటయ్యింది. ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్, రిఫ్రిజిరేటర్లను, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఉచితంగా రిపేర్ చేసి ఇచ్చేందుకు ’ ఫిక్స్ ఆల్’ ఆన్లైన్ సహాయకులు లిజి జాన్ బృందం సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. -
హుదూద్ పోర్టల్ ప్రారంభం: పనివారు సిద్ధం
హుదూద్ సహాయ కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఓ పోర్టల్‌ను సిద్ధం చేసింది. హుదూద్ ప్రళం, తుఫాను అనంతర పరిస్థితుల లాంటివాటిని ఇందులో పొందుపరిచారు. www.hudhud.ap.gov.in అనే ఈ వెబ్సైట్లో అన్ని వివరాలు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి. నిపుణులైన ప్లంబర్లు, కార్పెంటర్ల లాంటి పనివాళ్ల కోసం ఈ వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చు. తుఫాను కారణంగా విశాఖపట్నం, పరిసర ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. ఇప్పటికి చాలా ప్రాంతాల్లో పరిస్థితులు మామూలు స్థితికి రాలేదు. దాంతో వృత్తిపనివాళ్లు కావాలంటే ఈ వెబ్సైట్ ద్వారా సమాచారం అందిస్తే వెంటనే పంపుతారు. వాళ్లకు అయ్యే లేబర్ ఛార్జీలను కూడా ప్రభుత్వం భరిస్తుందని చెబుతున్నారు. మొత్తం వెయ్యిమంది వరకు పనివారు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనికోసం ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు.