సాక్షి, సిటీబ్యూరో: కరోనా లాక్‌డౌన్ గృహోపకరణాల మరమ్మతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్‌డౌన్‌లో మినహాయించిన అత్యవసర సేవల్లో గృహోపకరణాలు, వాటి మరమ్మతు షాపులు లేక పోవడం సమస్యగా మారింది. నిరుపేద కుటుంబం నుంచి సంపన్న కుటుంబాల్లో వరకు గృహోపకరణాలు మరమ్మతులకు గురికావడం సర్వసాధారణమే. మరమ్మతు సమస్య చిన్నదైనా..ఐదు నిమిషాల్లో రిపేర్ చేసేదైనా... గృహిణులకు మాత్రం పెద్దదిగా కనిపిస్తోంది. వాటి ప్రభావం దైనందిన జీవనంపై కనిపిస్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రతి ఇంటా ఎలక్ట్రానిక్, ప్లంబర్, గ్యాస్‌స్టౌ, వంటావార్పు పరికరాలు, ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, కూలర్ తదితర ఏదో ఒక మరమ్మతు సమస్య వెంటాడుతూనే ఉంటాయి. వంటవార్పునకు సంబంధించిన పరికరమైతే మహిళల చికాకు అంతా ఇంతా కాదు. కొన్ని సందర్భాల్లో అన్నం, కూరల వంట సైతం కష్టతరంగా మారింది. మరోవైపు లాక్‌డౌన్‌తో పిల్లలు, యువత ఇంటికే పరిమితమైన కారణంగా కాలక్షేపానికి టీవీ, కేబుల్ కనెక్షన్, మొబైల్, ల్యాప్‌టాప్, డెస్క్ టాప్, ఇంటర్నెట్ అత్యవసరం. వాటిలో ఏ ఒక్కటి మొరాయించినా ఇబ్బందే. రిపేర్ చేయించలేం.. కొత్తది కొనలేని పరిస్థితి.
అపార్ట్‌మెంట్స్‌లో జటిలం
మహా నగరంలోని ఆపార్ట్‌మెంట్‌వాసులకు నీరు, డ్రైనేజీ, గృహోపకరణాల రిపేర్ సమస్య మరింత జటిలమై వెంటాడుతోంది. సాధారణంగా నగరంలో బహుళ అంతస్తుల భవన సముదాయాలు అధికం. ఒక్కో భవన సముదాయంలో కనీసం 12 నుంచి 40 కుటుంబాల వరకు నివాసం ఉంటాయి. ఆయా నివాస సముదాయంలోని ఫ్లాట్స్‌లో ఎలాంటి మరమ్మతు వచ్చినా పర్మినెంట్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఇతర మెకానిక్‌లు ఉంటారు. కాల్స్ పై స్పందిస్తూ తక్షణమే సేవలందిస్తుంటారు. ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా వారు కూడా అందుబాటులో లేకుండా పోయారు. ఉదాహరణాకు అపార్ట్‌మెంట్స్‌లో పొరపాటున నీటి మోటార్, డ్రైనేజీ పైప్‌లైన్ సమస్య ఏర్పడితే మరమ్మతుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఒక వేళ అందుబాటలో ఉన్న మెకానిక్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్స్‌లను పిలిపించినా... పాడైపోయిన పరికరం స్థానంలో కొత్తది అమర్చేందుకు సంబంధిత దుకాణాలు మూసివేసి ఉంటుండటంతో సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో అపార్ట్‌మెంట్స్‌లో నీరు, నల్లా లీకేజీలు, డ్రైనేజీ సమస్యలు వెంటాడుతున్నాయని పలువురు ఫ్లాట్‌వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
ఉపాధి కోల్పోయిన మెకానిక్‌లు
గృహోపకరణాల షాపులు మూత పడటంతో వాటిపై ఆధార పడిన మెకానిక్‌లు ఉపాధి కోల్పోయారు. ఏదైనా వస్తువు పాడైతే వాటి మరమ్మతులకు వినియోగదారులు షాపులను ఆశ్రయిస్తుంటారు. కొందరు గృహోపకరణాలు విక్రయించే షాపుల్లో పనిచేస్తూ , మరి కొందరు స్వయంగా చిన్నచిన్న షాపులు, డబ్బాలు పెట్టుకొని, మరికొందరు ఇంటింటికి వెళ్లి మరమ్మతు పనులు చేస్తుంటారు. లాక్‌డౌన్ కారణంగా షాపుల మూత పడటంతో కనీసం పని లేకుండా పోయింది. వినియోగదారుల కాల్స్‌పై వెళ్లిన సంబంధిత పరికరం అందుబాటులో లేక, కొనుగోలు చేసేందుకు షాపులు బంద్‌తో సమస్య పరిష్కరించకుండానే ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment