జైట్లీతో కేసీఆర్ భేటీ
‘నోట్ల రద్దు’ పరిణామాలపై చర్చ
ప్రభుత్వ పథకాల అమల్లో ఇబ్బందులు వస్తున్నాయన్న కేసీఆర్!
కేంద్ర ప్రభుత్వం తగిన సహాయం చేయాలని విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సీఎం కె.చంద్రశేఖరరావు గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్.. జైట్లీ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రెండో విడత నిధులు రూ.450 కోట్లు విడుదల చేయాలని జైట్లీని కోరారు. అనంతరం నోట్ల రద్దు నేపథ్యంలో తెలంగాణలో నెలకొన్న పరిస్థితిపై వారు చర్చించారు. రాష్ట్ర ఖజానాపై ప్రభావం, ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను అధిగమించడానికి అవసరమైన చర్యలపై అభిప్రాయాలు పంచుకున్నట్టు తెలుస్తోంది. నోట్ల రద్దు వల్ల తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాల అమల్లో జాప్యం ఏర్పడుతున్న నేపథ్యంలో.. వాటి అమలుకు కేంద్రం సాయం చేయాల్సిందిగా కేసీఆర్ కోరినట్టు సమాచారం.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెల్లించాల్సిన పన్నుల కాల పరిమితిని వాయిదా వేయాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఆసరా పింఛన్ల మంజూరులో ఏర్పడుతున్న సమస్యలు, ప్రజల ఇక్కట్లు తీర్చడానికి బ్యాంకర్లతో జరిగిన సమీక్ష సమావేశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అలాగే పునర్వ్యవస్థీకరణ చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల అమలుపైనా వారు చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వెంట ఎంపీలు జితేందర్‌రెడ్డి, కె.కేశవరావు, బి.వినోద్ కుమార్ ఉన్నారు.
గడ్కరీ కుమార్తె రిసెప్షన్‌కు సీఎంలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, చంద్రబాబు హాజరయ్యారు. గురువారం గడ్కరీ నివాసం లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రులతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు హాజరయ్యారు.