పనాజి : కరోనా తీవ్రతరం అయ్యిందని ఇప్పటికే రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి మొదలైందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో సావంత్ మాట్లాడుతూ.. 'గోవా అంతటా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒక రోగి నుంచి మరొకరికి వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ (సామాజికవ్యాప్తి) మొదలైందనే నిజాన్ని అంగీకరించక తప్పదు' అంటూ పేర్కొన్నారు. అయితే వైరస్ కట్టడికి ప్రభుత్వం అన్ని కఠినమైన చర్యలు చేపడుతుందని అన్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్న ఏకైక రాష్ట్రం గోవానే అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
(పంజాబ్ సీఎస్‌గా ఎన్నికైన మొట్టమొదటి మహిళ )
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి కఠిన నిబంధనలు అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అయితే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా దానికి ప్రజలు కూడా అదే స్థాయిలో స్పందించాలని లేదంటే అధికారులు పడే కష్టమంతా వృధానే అని అన్నారు. ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. మే చివరి నాటికి కోవిడ్ ఫ్రీగా ఉన్న గోవా రాష్ట్రంలో క్రమంగా కేసులు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాస్కోలోని మాంగోర్ హిల్, సత్తారి తాలూకాలోని మోర్లెం ప్రాంతాలను కంటైనేషన్ జోన్లగా ప్రకటించగా,మరికొన్ని ప్రాంతాలను మినీ కంటైన్‌మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు.
శుక్రవారం ఒక్కరోజే 44 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్రం వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 1,039 కాగా ప్రస్తుతం 667 యాక్టివ్ కేసులున్నాయని ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు మరణించిన ఇద్దరు మరణించినట్లు పేర్కొంది. వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడానికి అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం సిద్ధం చేసిందని ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణె అన్నారు. అవసరమైతే కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ఉత్తర గోవా జిల్లాల్లో ఈఎస్ఐ హాస్పిటల్ తరహాలో ప్రత్యేకంగా ఆసుపత్రి నిర్మాణం చేస్తామని తెలిపారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి అవరమైన అన్ని రకాల సౌకర్యాలను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు.
(సోషల్ మీడియాలో టీచర్ల మార్ఫింగ్ ఫొటోలు )
Comments
Please login to add a commentAdd a comment