కాంగ్రెస్ నౌకకు మాజీ సీఎం రంధ్రం పెట్టారు
బిలాస్పూర్: కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నౌక లాంటిదని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని, చాలామంది నాయకులు ఆ పార్టీ వీడాలని భావిస్తున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయిన సందర్భంగా చత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో జరిగిన ర్యాలీలో రాజ్నాథ్ ప్రసంగించారు.
చత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కూడా కాంగ్రెస్ పార్టీ అనే మునిగిపోతున్న నౌకకు ఓ రంధ్రం పెట్టారని రాజ్నాథ్ ఛలోక్తి విసిరారు. కాంగ్రెస్ పార్టీని ప్రపంచంలోని ఏ శక్తి కూడా రక్షించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా పార్టీ పెట్టబోతున్నట్టు ఇటీవల అజిత్ జోగి ప్రకటించిన నేపథ్యంలో రాజ్నాథ్ పైవిధంగా స్పందించారు. కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా అవినీతి ఉండేదని విమర్శించారు. ప్రస్తుతం మోదీ పాలనలో అవినీతి ఉందని ఒక్కరూ కూడా ఆరోపించలేదని అన్నారు.