
న్యూఢిల్లీ: 2018–19 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశాపూరితమైనదిగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. ఈ బడ్జెట్ ప్రజల్ని తీవ్రంగా నిరుత్సాహపర్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం విమర్శించారు. ‘ఇదో నిరాశాపూరితమైన బడ్జెట్. ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న పలు సమస్యల్ని పరిష్కరించడంలో తాము విఫలమైనట్లు తాజా బడ్జెట్‌తో కేంద్రం అంగీకరించినట్లయింది. ఇందులో ఆందోళన కల్గించే తీవ్రమైన ప్రతిపాదనలు ఉన్నాయి. దురదృష్టవశాత్తూ ఈ బడ్జెట్‌లోని ప్రతిపాదనలు తీవ్రంగా నిరుత్సాహపర్చాయి.
ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున 10 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య రక్షణ కల్పిస్తామని జైట్లీ చెప్పడం పెద్ద బూటకం’అని విమర్శించారు. ఆర్థిక స్థిరీకరణ పరీక్షలో జైట్లీ తీవ్రంగా విఫలమయ్యారని ఆరోపించారు. ‘ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2018–19 బడ్జెట్‌లో ఆర్థిక స్థిరీకరణ పరీక్షలో విఫలమయ్యారు. 2017–18 ఆర్థిక లోటును 3.2 శాతానికి పరిమితం చేయలేకపోయారు. ప్రస్తుతం ఆర్థికలోటును ప్రభుత్వం 3.5 శాతంగా అంచనా వేస్తోంది. ఈ వైఫల్యంతో దేశం తీవ్రమైన పర్యావసనాలను ఎదుర్కోవాల్సి వస్తుంది’అని చిదంబరం హెచ్చరించారు.