ఆ ఈవెంట్‌కు రాహుల్‌ హాజరవుతారా..? | Congress Clarifies On Rahul Gandhis Presence At RSS Event | Sakshi
Sakshi News home page

ఆ ఈవెంట్‌కు రాహుల్‌ హాజరవుతారా..?

Published Fri, Aug 31 2018 9:17 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Congress Clarifies On Rahul Gandhis Presence At RSS Event - Sakshi

కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ (ఫైల్‌ఫోటో)

సాక్షి, ముంబై : కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఆరెస్సెస్‌ కార్యక్రమంలో పాల్గొంటారా, ఆహ్వానాన్ని తిరస్కరిస్తారా అనే ఉత్కంఠకు కాంగ్రెస్‌ తెరదించింది. రాహుల్‌ లేదా పార్టీ నుంచి మరో నేత ఎవరైనా ఆరెస్సెస్‌ కార్యక్రమానికి హాజరయ్యే ప్రస్తక్తే లేదని సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున ఖర్గే స్పష్టం చేశారు. ‘ముందు ఆహ్వానం అందనీయండి..ఇదంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నార’ని ఖర్గే పేర్కొన్నారు. వచ్చే నెలలో ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో ఉపన్యాసం ఇచ్చేందుకు రాహుల్‌ను ఆహ్వానించాలని ఆరెస్సెస్‌ యోచిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఆరెస్సెస్‌ భావజాలం, సిద్ధాంతాలతో కాంగ్రెస్‌ విభేదిస్తుందని, బీజేపీ, కాషాయకూటమిని అధికారం నుంచి దూరం పెట్టేందుకే కర్ణాటకలో తమ పార్టీ సీఎం పదవినే వదులుకున్నదని ఖర్గే గుర్తు చేశారు. కర్ణాటకలో ఓ చిన్న ప్రాంతీయ పార్టీ (జేడీ-ఎస్‌)కి కేవలం 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నా తమకు 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ లౌకిక శక్తుల బలోపేతానికి సీఎం పదవిని వదులుకున్నామని చెప్పుకొచ్చారు.

ఆరెస్సెస్‌ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎవరూ వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.దేశానికి, దళితులు,వెనుకబడిన వర్గాల వారికి ఆరెస్సెస్‌ సిద్ధాంతం విషంతో సమానమని ఆయన అభివర్ణించారు. ఆరెస్సెస్‌ కార్యక్రమానికి వెళ్లడం గురించి రాహుల్‌ తనను సంప్రదిస్తే ఆ కార్యక్రమానికి వెళ్లవద్దని తాను సూచిస్తానని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement