కాంగ్రెస్ నాయకులు సాధారణంగా ప్రధానిగా సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ వీరిద్దరూ కాకుంటే ప్రియాంక గాంధీ కావాలని చెబుతారు. గోవాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వజీత్ రాణె మాత్రం ఊహించని ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ కంటే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ప్రధానిని చేయాలని కోరారు. సింధియాకు గొప్ప నేపథ్యముందని వ్యాఖ్యానించారు. ఇక రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ను కేంద్ర ఆర్థిక మంత్రిగా నియమించాలని కోరారు. ఇక కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేను పదవి నుంచి తొలగించాలని ఫేస్బుక్లో పేర్కొన్నాడు.
'దేశానికి జ్యోతిరాదిత్య సింధియా వంటి యువ ప్రధాని అవసరం. ఆయనకు గొప్ప నేపథ్యముంది. యువ భారత్తో ఆయన మమేకం కాగల సత్తా ఉంది' అని రాణె రాసుకున్నారు. విశ్వజీత్ గోవా మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ రాణె కుమారుడు. ఆ రాష్ట్ర కాంగ్రెస్లో శక్తివంతమైన నాయకుడు. గాంధీ కుటుంబానికి సమాంతరంగా మరొకరని కీర్తించడానికి కానీ వ్యతిరేకంగా మాట్లాడటానికి కానీ ఏ మాత్రం సహంచని అధిష్టానం రాణె విషయంలో ఏ చర్యలు తీసుకుంటుందో..?