అసోం, మహారాష్ట్రలో కాంగ్రెస్ కుదేలు
కాంగ్రెస్ పార్టీకి వరుసపెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసోం, మహారాష్ట్రలలో ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అసోంలో అక్కడి ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్కి వ్యతిరేకంగా చిన్నపాటి విప్లవమే చెలరేగింది. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు గొగోయ్ నాయకత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తూ అసెంబ్లీ స్పీకర్ను కలిశారు. వీళ్లను బుజ్జగించడానికి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ప్రయత్నిస్తుండగానే.. మహారాష్ట్రలో పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణే తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాను ఇంకా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆమోదించాల్సి ఉంది.
ముఖ్యమంత్రిని మార్చి తీరాల్సిందేనంటూ నారాయణ్ రాణే గట్టిగా పట్టుబడుతున్నారు. మార్చని పక్షంలో లోక్సభ ఎన్నికల కంటే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏమంత భిన్నంగా ఉండబోవని ఆయన రెండు రోజుల క్రితం కన్కావలి ప్రాంతంలో జరిగిన సభలో చెప్పారు. 2005లో శివసేన నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రాణే, తన రాజకీయ భవితవ్యంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. 'రాణే లాంటివాళ్లకు కాషాయ పార్టీలో స్థానం లేదు' అంటూ శుక్రవారం నాడు ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించగా, దమ్మున్న నాయకులకు ఎక్కడైనా ఖాళీ ఉంటుందని రాణే అన్నారు. అసలే కాంగ్రెస్- ఎన్సీపీ సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న ఈ సమయంలో రాణే కూడా రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది.