సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. గత నెల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టిన మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ రాణే.. నేడు ’మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష‘ పేరుతో కొత్త పార్టీ ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాక కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌లోనూ, ఇతర పార్టీల్లొనూ కొనసాగుతున్న మిత్రులు, మరికొందరు తన పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. పార్టీ యాక్షన్ ప్లాన్‌ను త్వరలో ప్రకటిస్తానని రాణే ప్రకటించారు.
నారాయణ్ రాణే కాంగ్రెస్ పార్టీనుంచి వైదొలిగాక.. ఆయన బీజేపీలో చేరతారనే ఊహాగానాలు భారీగా వెల్లువెత్తాయి. బీజేపీకి 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాణే చేరిక లాభిస్తుందని అందరూ అంచనాలు వేశారు. రాణే స్వస్థలమైన కొంకణ్ ప్రాంతంలో విస్తరించాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాణే బీజేపీలో చేరతారని అనుకున్నారు.