‘ఆయన చేతుల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది’
పనాజీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని గోవా మంత్రి, ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ నేత విశ్వజిత్ రాణే జోస్యం చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయానికి అది జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచిన విశ్వజిత్ రాణే అనంతరం మార్చి 16న రాజీనామా చేసి బీజేపీలో చేరగా ఆయనకు కేబినెట్ హోదా ఇవ్వడంతోపాటు ప్రస్తుతం ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్నారు. అయితే, త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఆయనకు పోటీ చేసే అవకాశం ఇవ్వొద్దని పేర్కొటూ కాంగ్రెస్ పార్టీ ముంబయి హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ పై విధంగా అన్నారు.
‘కాంగ్రెస్ పార్టీలో ఉండాలని ఏ ఒక్కరికీ ఇష్టం ఉండదు. ముఖ్యంగా రాహుల్‌గాంధీలాంటి విఫలమైన వ్యక్తి నాయకత్వంలో. కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో రాహుల్ నాయకత్వంలో తుడిచిపెట్టుకుపోతుంది’ అని ఆయన అన్నారు. కోర్టులో పిటిషన్‌పై స్పందిస్తూ తానేం తప్పు చేయలేదననే, ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేశానని, మరోసారి ప్రజల తీర్పును తెలుసుకునేందుకు ఉప ఎన్నికల్లో వెళతానని అన్నారు. మనోహర్ పారికర్ నాయకత్వంలో తమ ప్రభుత్వం కలిసికట్టుగా సాగుతోందని అన్నారు.