2019లో ఆ పార్టీకి 20 సీట్లకు మించిరావు
న్యూఢిల్లీ: గోవా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్ సిన్హ్ రాణె కొడుకు విశ్వజిత్ రాణె మరోసారి రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ ప్రభావశీల, ఆమోదనీయ రాజకీయ నాయకుడు కాదని, 2019 జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 20 సీట్లకు మించి గెలవలేదని అన్నారు.
'కాంగ్రెస్‌లో పరిణతి లేని నాయకుడు రాహుల్ ఉన్నారు. రాష్ట్ర ప్రజల గురించి, వారిచ్చిన తీర్పు గురించి, ప్రభుత్వ ఏర్పాటు గురించి ఆయన సీరియస్‌గా ఆలోచించరు. ఆయన కనీసం ఆమోదనీయ నాయకుడు కూడా కాదు. పార్టీ ఎదగాలంటే నాయకుడు శక్తిమంతంగా ఉండటం చాలా ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాహుల్ కొనసాగితే.. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతమున్న 44 సీట్లు 20కు తగ్గుతాయి. రాహుల్ నాయకత్వంలో పార్టీకి దిశానిర్దేశం లేదు. 10 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు. వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనే సత్తాగల నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఒక్కరూ లేరు' అని విశ్వజిత్ రాణె అన్నారు. ఇటీవల జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అగ్రశ్రేణి నాయకులు విఫలమయ్యారని ఆరోపిస్తూ రాణె రాజీనామా చేశారు.