‘నీట్’ పరిధిలోనే మేనేజ్‌మెంట్ కోటా | 'Consider NEET only for management quota' | Sakshi
Sakshi News home page

‘నీట్’ పరిధిలోనే మేనేజ్‌మెంట్ కోటా

Published Wed, May 25 2016 1:42 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM

‘నీట్’ పరిధిలోనే మేనేజ్‌మెంట్ కోటా - Sakshi

‘నీట్’ పరిధిలోనే మేనేజ్‌మెంట్ కోటా

  • కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ఆమోదం
  • ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు, ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటాకు ఈ ఏడాది మినహాయింపు
  • ఈ సీట్లను నీట్ లేదా ఎంసెట్‌తో భర్తీ చేసే స్వేచ్ఛ రాష్ట్రాలకే
  • ప్రైవేట్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటాకు నీట్ తప్పనిసరి
  • వచ్చే ఏడాది నుంచి చట్టబద్ధంగా నీట్ అమలు: నడ్డా
  • ఏపీ, తెలంగాణలో ఎంసెట్ ద్వారానే వైద్య విద్య ప్రవేశాలు
  • రాష్ర్టపతి సందేహాలను నివృత్తి చేసిన ఉన్నతాధికారులు
  • చైనా పర్యటనకు వెళ్లే ముందు ఆర్డినెన్స్‌పై ప్రణబ్ సంతకం
  •  
     సాక్షి, న్యూఢిల్లీ: వైద్యవిద్య ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) నుంచి రాష్ట్రాలకు ఏడాదిపాటు మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌కు అవరోధాలు తొలగిపోయాయి. నీట్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి రాష్ట్రాలకు ఒక ఏడాది మినహాయింపు ఇస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. మంగళవారం చైనా పర్యటనకు బయలుదేరే ముందు నీట్ ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి సంతకం చేశారు. సాయంత్రం ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చినట్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది.
     
     దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది వైద్యవిద్య ప్రవేశాలకు నీట్ నుంచి ఏడాదిపాటు మినహాయింపు లభించింది. ఏపీ, తెలంగాణలో ఎంసెట్ ద్వారానే ఈ ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లు భర్తీ అవుతాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఈ ఏడాది మాత్రమే నీట్ నుంచి మినహాయింపు ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా స్పష్టం చేశారు. అయితే ప్రైవేట్ కాలేజీలకు నీట్ నుంచి మినహాయింపు లేదని, వీటిలో కేవలం కన్వీనర్ కోటా సీట్లకు మాత్రమే ఈ సంవత్సరం మినహాయింపు ఉంటుందన్నారు. వీటిని నీట్ లేదా ఎంసెట్ ద్వారా భర్తీ చేసే స్వేచ్ఛ రాష్ట్రాలకే వదిలేశామని నడ్డా స్పష్టంచేశారు. ప్రైవేట్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్, ఎన్నారై కోటా సీట్లు మాత్రం నీట్ కిందకే వస్తాయన్నారు.
     
     రెండు ఆర్డినెన్స్‌లపై సంతకాలు
     ఎంబీబీస్, బీడీఎస్ కోర్సులకు సంబంధించి రాష్ట్రపతి రెండు వేర్వేరు ఆర్డినెన్స్‌లపై సంతకాలు చేశారు. నీట్ అమలుకు అనుగుణంగా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం-1956లో సవరణల ద్వారా హిందీ, ఆంగ్ల భాషలతోపాటు ప్రాంతీయ భాషల్లో ఎంబీబీస్, పీజీ ప్రవేశ పరీక్షలు నిర్వహించే వీలు కల్పిస్తూ ఏ కోర్టు తీర్పుకు సంబంధం లేకుండా ఒక ఆర్డినెన్స్‌ను కేంద్రం జారీ చేసింది.
     
     అదేవిధంగా డెంటల్ కోర్సులకు సంబంధించి డెంటిస్ట్స్ చట్టం-1948లో సవరణల ద్వారా హిందీ, ఆంగ్ల భాషలతోపాటు ప్రాంతీయ భాషల్లో గ్రాడ్యుయేట్, పీజీ కోర్సుల్లో ప్రవేశపరీక్షలు నిర్వహించే వీలు కల్పిస్తూ ఏ కోర్టు తీర్పుకు సంబంధం లేకుండా మరొక ఆర్డినెన్స్‌ను తెచ్చింది. మంత్రి నడ్డా సోమవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి ఆర్డినెన్స్ జారీ చేయాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు.
     
     దీనిపై ప్రణబ్ సందేహాలు లేవనెత్తగా, శాఖ ఉన్నతాధికారులు మంగళవారం ఉదయం రాష్ట్రపతి వద్దకు వచ్చిన వాటిని నివృత్తి చేశారు. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. కాగా, నీట్ ఆర్డినెన్స్‌పై గెజిట్‌ను కేంద్రం మంగళవారం సాయంత్రం నోటిఫై చేసింది. ఈ ఏడాది 85 శాతం సీట్లను తమ సొంత పరీక్షల ద్వారా లేదా నీట్ ద్వారా భర్తీ చేసుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉండగా, మిగిలిన 15 శాతం సీట్లను మాత్రం నీట్ ద్వారా అఖిల భారత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది.
     
     వచ్చే ఏడాది నుంచి నీట్: నడ్డా
     ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని రాష్ర్ట ప్రభుత్వ సీట్లకు, ప్రైవేటు కాలేజీల్లోని ప్రభుత్వ సీట్లకు మాత్రమే నీట్ నుంచి ఈ ఏడాది మినహాయింపు ఉంటుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా నీట్‌ను చట్టబద్దంగా అమలు చేస్తామని, ప్రాంతీయ భాషల్లోనే పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 2017-18 సంవత్సరానికిగాను వచ్చే డిసెంబర్ తర్వాత జరిగే మెడికల్ పీజీ కోర్సుల పరీక్షలు నీట్ కిందకే వస్తాయని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టుకు సెలవులు ఉండటంతోపాటు పార్లమెంటు నిరవధిక వాయిదా పడినందున ఆర్డినెన్స్ తీసుకురావాల్సి వచ్చిందని నడ్డా విలేకరులకు చెప్పారు.
     
     ఇప్పటికే ఏడు రాష్ట్రాలు నీట్ నిర్వహణకు అంగీకరించినట్లు తెలిపారు. కొన్ని రాష్ట్రాలు పూర్తిగా నీట్ ద్వారానే అడ్మిషన్లకు అంగీకరించగా, ఏపీ, తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు ఈ ఏడాదికి మినహాయింపు కోరాయన్నారు. జూలై 24న నీట్-2 పరీక్షను యథాతథంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. నీట్-1 పరీక్షకు 6.25 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రాలను నీట్ పరిధి నుంచి ఈ ఏడాది తప్పించాలని కేంద్రం ప్రయత్నిస్తోందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. నీట్‌ను రద్దు చేశామన్న ప్రచారం నిజం కాదంటూ నడ్డా తోసిపుచ్చారు. ఆర్డినెన్స్ ద్వారా నీట్‌కు చట్టబద్దత కల్పించామన్నారు. నీట్‌ను అమలు చేయాలని కేంద్రమే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసిందని గుర్తు చేశారు. రాష్ట్రాల అభ్యర్థన మేరకే కేంద్రం పునరాలోచన చేసిందని, నీట్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తుందని నడ్డా వివరించారు.
     
     రాష్ట్రాలు కోరినందునే...
     రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు వ్యక్తంచేసిన ఆందోళలను ఆర్డినెన్స్ ద్వారా తొలగించామని నడ్డా చెప్పారు. నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పలు రాష్ట్రాలు తమ సమస్యలతో కేంద్రం వద్దకు వచ్చాయన్నారు. నీట్‌పై పార్లమెంట్‌లో కూడా పలువురు ఎంపీలు తమ రాష్ట్రాల్లోని సమస్యలను ప్రస్తావించారని పేర్కొన్నారు. 18 రాష్ట్రాలు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో గతవారం సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నామని నడ్డా చెప్పారు. నీట్‌కు దాదాపుగా అన్ని రాష్ట్రాలు సమ్మతం తెలిపాయని, అయితే కొన్ని రాష్ట్రాలు ఈ ఏడాదికి మినహాయింపు కావాలని కోరాయన్నారు. అప్పటికే రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తూ ఉండటం, సిలబస్, భాషా సమస్యలపై అభ్యంతరం చెప్పాయన్నారు.
     
     సిలబస్, ప్రాంతీయ భాషల్లోనే పరీక్షలు నిర్వహించాల్సిన ఆవశ్యకత తదితర అంశాలను రాష్ట్రాలు ఎత్తిచూపాయన్నారు. ఆ తర్వాత నీట్‌పై కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వివిధ పార్టీల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుందని నడ్డా పేర్కొన్నారు. సూత్రప్రాయంగా నీట్ అమలు కావాల్సిందేనని, అయితే రాష్ట్రాల సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని ఈ సమావేశంలో సూచించారన్నారు. కేంద్రం పంపిన ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించడంలో జాప్యం జరిగిందన్న అంశం వాస్తవం కాదన్నారు. ఆర్డినెన్స్‌పై సంతకం చేసే ముందు సంబంధిత మంత్రి నుంచి రాష్ట్రపతి వివరణ కోరడం సాధారణమేనని నడ్డా చెప్పారు. హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఒడిశా, చండీగఢ్ రాష్ట్రాలు నీట్ కింద పరీక్షలు నిర్వహించాయని తెలిపారు. బిహార్ కూడా నీట్‌ను ఎంచుకుందని, అయితే ఢిల్లీ మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్రాలు సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపించలేదని, వారికి ఊరట కల్పించేందుకే తాము ఆర్డినెన్స్ తెచ్చామని చెప్పారు. నీట్‌పై ఆర్డినెన్స్‌తో ఎన్డీఏ పాలనలో జారీచేసిన ఆర్డినెన్స్‌ల సంఖ్య 21కి చేరింది.
     నీట్‌తో అవకతవకలకు తెర: వెంకయ్యనాయుడు
     కేంద్రం నీట్‌పై సానుకూలంగా ఉందని, దీనిద్వారా ప్రైవేటు వైద్య కళాశాలల్లో అక్రమాలకు తెరపడుతుందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. పరీక్ష సన్నద్ధతకు కొంచెమే సమయముందంటూ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, వివిధ రాజకీయ పార్టీలు పార్లమెంటులో చెప్పాయని, దీన్ని దృష్టిలో పెట్టుకునే కేబినెట్ ఆర్డినెన్స్ తెచ్చిందన్నారు.
     
     అవకతవకలకు తెర
     కేంద్రం నీట్‌పై సానుకూలంగా ఉందని, దీనిద్వారా ప్రైవేటు వైద్య కళాశాలల్లో అక్రమాలకు తెరపడుతుందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. పరీక్ష సన్నద్ధతకు కొంచెమే సమయముందంటూ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, వివిధ రాజకీయ పార్టీలు పార్లమెంటులో చెప్పాయని, దీన్ని దృష్టిలో పెట్టుకునే కేబినెట్ ఆర్డినెన్స్ తెచ్చిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement