‘ట్రాన్స్ జెండర్స్’కు ప్రత్యేక తరగతికి చెందినవారిగా గుర్తించి వారికి విద్యా, ఉద్యోగ అవకాశాల్లో మూడు శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
చెన్నయ్: ‘ట్రాన్స్ జెండర్స్’కు ప్రత్యేక తరగతికి చెందినవారిగా గుర్తించి వారికి విద్యా, ఉద్యోగ అవకాశాలను పెంపొందించేందుకు మూడు శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వ సాంఘిక సంక్షేమశాఖకు మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వాజ్యాన్ని(పిల్) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
ప్రభుత్వంలోని వివిధ ఉద్యోగాలకు గాను నిర్వహించిన పోటీ పరీక్షలకు పురుషుల విభాగంలో హాజరైన ట్రాన్స్‌జెండర్ మహిళలు దాఖలు చేసుకున్న పిటిషన్లను ధర్మాసనం విచారించింది. వారికి విద్యా, ఉద్యోగ రంగాల్లో ప్రత్యేకతరగతి వారిగా గుర్తించి మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని దీనిపై ఆరు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి వివిధ విభాగాలతో సంప్రదించి చర్యలు తీసుకోవాలంది.