నాడు డీలాగా.. నేడు ఉత్సాహంగా!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత శనివారం ఐదోసారి ప్రమాణ స్వీకారం చేసిన వేళ అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు పునరుత్తేజాన్ని ప్రదర్శించారు. పార్టీ అధినేత్రి జయ గతంలో జైలుపాలైనప్పుడు ఒ.పన్నీర్ సెల్వం అధికార పీఠం అధిష్టించినప్పుడు మాత్రం పార్టీ కార్యకర్తలు నిస్తేజంగా, ఏదో కోల్పోయినట్టుగా కనిపించారు. కానీ ఇంతలోనే ఎంత తేడా.. శనివారం ఆ సీన్ పూర్తిగా రివర్సయింది. జయ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారవేళ పార్టీ కార్యకర్తలు నూతన ఉత్సాహంతో ఉన్నారు. మద్రాస్ లోని సెంటినరీ ఆడిటోరియంలో జయలలిత ప్రమాణ స్వీకారం చేయడంతోనే శనివారం ఒక్కసారిగా పండుగ శోభను సంతరించుకుంది. ఆమెతపాటు 28 మంది మంత్రుల బృందం ప్రమాణ స్వీకారం చేసింది.
గతేడాది బెంగళూరు కోర్టు తీర్పు వెలువడిన తర్వాత జయలలిత సీఎం పదవికి రాజీనామా చేయగా ఆమె అనుచరుడు, నమ్మకస్తుడైన పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. సెల్వంతో పాటు ఇతర మంత్రులూ స్వీకారం చేస్తున్నప్పుడు భావోద్వేగాలను ఆపుకోలేక చాలామంది కంటతడి పెట్టారు. జయలలిత జైలుకు వెళ్లాలన్న కోర్టు తీర్పుతో అభిమానులు, పార్టీ మంత్రులు షాక్ కు గురయ్యారు. అయితే కర్ణాటక హైకోర్టు మాత్రం ప్రత్యేక కోర్టు తీర్పును కొట్టేసి.. జయ నిర్దోషి అని చెప్పడంతో ఆమె మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో శనివారం జరిగిన ప్రమాణస్వీకారాన్ని పార్టీ కార్యకర్తలు ఓ ఉత్సవంలా చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే.. తమిళ 'అమ్మ' జయలలితకు రాష్ట్రంలో ఉన్న క్రేజ్ ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు.