గాడిలో పెట్టండి!
రాష్ట్రంలో ప్రభుత్వ పాలనను గాడిలో పెట్టే విధంగా సీఎం పన్నీరు సెల్వంతో కలసి ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిందేనని అన్నాడీఎంకే అధినేత్రి జే జయలలిత మంత్రులకు ఉపదేశించారు. ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తే పదవులు ఊడుతాయన్న హెచ్చరికలు చేసినట్టు సమాచారం.
సాక్షి, చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఏ ముహూర్తాన జయలలితకు దూరం అయిందో ఏమోగానీ, ఆ రోజు నుంచి రాష్ట్రంలో పాలన కుంటుపడింది. పన్నీరు సెల్వం నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక, కొందరు మంత్రులు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించడం మొదలెట్టారు. ఇది వరకు ఏ ఆదేశాలు అయినా, ఏ ఉత్తర్వులు అయినా, ఏ ప్రకటన అయినా, సీఎం కార్యాలయం నుంచి వెలువడేది. అయితే, మంత్రుల కార్యాలయాల నుంచి తాజాగా సమాచారాలు బయటకు వెళ్లడం మొదలైంది. జయలలిత బెయిల్ మీద బయటకు వచ్చే వరకు ఓపిగ్గా వ్యవహరించిన సీఎం పన్నీరు సెల్వం, ఇక పాలనపై పట్టు సాధించేందుకు పరుగులు తీస్తున్నారు.
విమర్శలు: రాష్ట్రంలో ప్రభుత్వ పాలన కుంటుపడిం దంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. పాలన గాడి తప్పిందంటూ, కొందరు మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ రోజురోజుకూ ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతూ వస్తున్నాయి. అధికార యంత్రాంగం సైతం గందరగోళ పరిస్థితుల్లో పడింది. ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినకూడదన్న డైలమాలో పడ్డారు. సీఎం పన్నీరు సెల్వం సైతం సమీక్షల్లో తన ఫొటోలు కూడా కన్పించనంతగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో జయలలిత పిలుపు కోసం ఎదురు చూపుల్లో ఉన్న పన్నీరు సెల్వంకు రెండు రోజుల క్రితం పోయిస్ గార్డెన్ నుంచి ఆహ్వానం వచ్చినట్టు సమాచారం.
గాడిలో పెట్టండి : పోయిస్ గార్డెన్‌లో అడుగు పెట్టిన పన్నీరుసెల్వం ప్రభుత్వ వ్యవహారాల్ని పార్టీ అధినేత్రి జయలలిత దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అలాగే, కొందరు మంత్రుల వ్యవహార శైలి గురించి వివరించినట్టు ప్రచారం. పన్నీరు భేటీ అనంతం కాసేపటికి సీనియర్ మంత్రులు నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ఎడపాడి పళని స్వామిలు పోయిస్ గార్డెన్‌లో అడుగు పెట్టారు. నలుగురితో జయలలిత ప్రభుత్వ పరంగా చర్చించి కీలక సూచనలు చేసినట్టు సమాచారం. మంత్రులందరూ సీఎం పన్నీరు సెల్వం సూచన మేరకు నడచుకోవాలని ఉపదేశించారు. ఎవరికి వారు అన్నట్టుగా వ్యవహరిస్తే పదవులు ఊడుతాయన్న హెచ్చరికలు చేసినట్టుగా సచివాలయంలో ప్రచారం సాగుతోంది. ప్రతి వ్యవహారం ఇక, సీఎం పన్నీరు సెల్వం ద్వారానే సాగాలని, ఎవరికి వారు నిర్ణయాలు తీసుకోవద్దంటూ హితవు పలికారు.
సీఎం పన్నీరు సెల్వంకు పూర్తి సహకారం అందిస్తూ ముందుకు సాగాలని, ఇతరులెవ్వరూ ప్రభుత్వ వ్యవహారంలో తల దూర్చకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించినట్టు సమాచారం. పార్టీలోని ముఖ్య నాయకులకు సైతం జయలలిత హితబోధ చేశారు. ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని, పార్టీ పరంగా కార్యక్రమాల మీద దృష్టి సారించాలని సూచించారు. మంత్రుల్ని పిలిపించి ఉపదేశాలు ఇవ్వడం తరువాయి, ఇక పాలనపై పట్టు సాధించేందుకు పన్నీరు సెల్వం పరుగులు తీస్తున్నట్టుగా సచివాలయం వర్గాలు పేర్కొంటున్నారుు. పోరుుస్ గార్డెన్ నుంచి వచ్చే సంకేతాల మేరకు పాలనను గాడిలో పెట్టి, పూర్తి స్థాయిలో పట్టు సాధించే విధంగా పన్నీరు సెల్వం కసరత్తుల్లో మునిగినట్టు చెబుతున్నారు. అత్యవసరంగా మంత్రులను పిలిపించి క్లాస్ పీకడం వెనుక ఓ రహస్యం ఉందన్న ప్రచారం సైతం అన్నాడీఎంకే వర్గాల్లో సాగుతోంది. కొందరు మంత్రులను నెచ్చెలి శశికళ బంధువులు కలిసినట్టుగా జయలలిత దృష్టికి వచ్చినట్టు సమాచారం. అందుకే మంత్రుల్ని తీవ్రంగా మందలించి పన్నీరు సెల్వంకు పూర్తిగా సహకరించాలని హితవు పలికినట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం.