సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషుల ఉరితీతకు తాజా డెత్‌వారెంట్ జారీ అయిన నేపథ్యంలో దోషులు ఇప్పటికీ ఉరిని వాయిదా వేసేలా పలు మార్గాలను అన్వేషిస్తున్నారు. దోషుల్లో ఇప్పటివరకూ తమ ముందున్న న్యాయ అవకాశాలను ఉపయోగించుకోని పవన్ గుప్తా రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తారని ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు. ఇక మరో దోషి వినయ్ శర్మ జైలులో విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు జైలు అధికారులు వెల్లడించారు. తనను ఉంచిన సెల్‌లో గోడకు వినయ్ తలబాదుకున్నాడని, ఆయనకు స్వల్ప గాయాలయ్యాయని తీహార్ జైలు అధికారులు తెలిపారు. మరోవైపు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలులో ఇక ఎలాంటి జాప్యం చోటుచేసుకోరాదని నిర్భయ తల్లి ఆశాదేవి కోరుతున్నారు. నిర్భయకు న్యాయం జరగనిపక్షంలో హత్యాచారం వంటి తీవ్ర నేరాలకు గురైన బాధితులెవరికీ సత్వర న్యాయం జరిగే పరిస్థితి ఉండదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment