వినయ్ శర్మ
న్యూఢిల్లీ: ‘నిర్భయ’ హత్యాచార దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ వినయ్ శర్మ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఏఎస్ బోపన్న సభ్యులుగా ఉన్న ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించడంపై న్యాయ సమీక్ష అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
‘క్షమాభిక్ష కోరుతూ సమర్పించిన అన్ని సంబంధిత పత్రాలను సమగ్రంగా పరిశీలించిన తరువాతే రాష్ట్రపతి ఆ పిటిషన్‌ను తిరస్కరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతుంది. ఆ నిర్ణయంపై న్యాయ సమీక్ష అవసరమని భావించేందుకు ఎలాంటి ప్రాతిపదిక కనిపించడం లేదు. అందువల్ల ఈ రిట్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది. తన మానసిక పరిస్థితి సరిగ్గా లేదన్న పిటిషనర్ వాదనను కూడా కొట్టివేసింది. వినయ్ శర్మ ఆరోగ్యం సరిగ్గానే ఉన్నట్లు మెడికల్ రిపోర్ట్స్‌లో స్పష్టంగా ఉందన్నారు.
తిహార్ జైళ్లో తనను చిత్రహింసలు పెట్టారని, దాంతో తన మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదని, ఈ విషయాన్ని క్షమాభిక్ష అభ్యర్థనను తిరస్కరించే సమయంలో రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టుకు పెట్టుకున్న పిటిషన్‌లో వినయ్ శర్మ పేర్కొన్నారు. జైళ్లో చిత్రహింసల కారణంగా మానసిక అనారోగ్యానికి గురయ్యా నని స్పష్టం చేసే అన్ని పత్రాలను రాష్ట్రపతి దృష్టికి కేంద్రం తీసుకువెళ్లలేదని ఆ పిటిషన్‌లో శర్మ ఆరోపించారు. అయితే, వాదనలను విన్న ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది.
డెత్ వారెంట్ జారీ చేయొచ్చు: నిర్భయ దోషులకు వేర్వేరు రోజుల్లో ఉరిశిక్ష విధించేందుకు అనుమతించాలని కోరుతూ కేంద్రం వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని తాజాగా డెత్ వారెంట్లను ట్రయల్ కోర్టు జారీ చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే, నలుగురు దోషుల్లో పవన్ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకోలేదని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. 17న ట్రయల్ కోర్టు విచారణ ప్రారంభించే సమయానికి, పవన్ క్యూరేటివ్ పిటిషన్ వేస్తాడన్నారు.
ఇక పవన్ వంతు..
నలుగురు దోషుల్లో.. పవన్ గుప్తా ఇంకా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేయలేదు. పవన్‌కు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరే అవకాశం కూడా ఉంది. కాగా, తన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తోసిపుచ్చడాన్ని సవాలు చేస్తూ ముకేశ్ పెట్టుకున్న పిటిషన్‌ను ఇప్పటికే సుప్రీంకోర్టు కొట్టివేసింది. అక్షయ్ కుమార్ క్షమాభిక్ష అభ్యర్థనను కూడా రాష్ట్రపతి కొట్టేశారు.
స్పృహ కోల్పోయిన జస్టిస్ భానుమతి
నిర్భయ’ దోషులను వేర్వేరు రోజుల్లో ఉరి తీసేందుకు అనుమతించాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు వెలువరించే సమయంలో ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ భానుమతి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. కాసేపటికి మళ్లీ స్పృహలోకి వచ్చారు. వెంటనే ఇతర న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది ఆమెను తన చాంబర్‌లోకి తీసుకువెళ్లారు. ఆ తరువాత కోర్టు ప్రాంగణంలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స అందించారు. జస్టిస్ భానుమతి ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment