న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఉదంతం దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అతడి క్షమాభిక్షను తిరస్కరించాల్సిందిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు విఙ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మాట్లాడుతూ.. ముఖేశ్ పిటిషన్‌ను తిరస్కరించాల్సిందిగా ప్రతిపాదనలు పంపినట్లు ధ్రువీకరించారు. కాగా మరణ శిక్ష తప్పించుకునేందుకు ‘నిర్భయ’ దోషులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 22న నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలంటూ... డెత్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో... వినయ్ శర్మ(26), ముఖేశ్ సింగ్(32) ఆఖరి ప్రయత్నంగా క్యూరేటివ్ పిటిషన్లను దాఖలు చేశారు. (నిర్భయ దోషుల ఉరి : కొత్త ట్విస్టు)
ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం(అరుణ్ మిశ్రా, ఆర్‌ఎఫ్ నారీమణ్, ఆర్ భానుమతి, అశోక్ భూషణ్) వాటిని కొట్టివేసింది. దీంతో ముకేశ్ మంగళవారం క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆశ్రయించాడు. తన ఉరిశిక్షపై జారీ అయిన డెత్ వారంట్‌ను పక్కన పెట్టాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టుకు విన్నవించాడు. ఈ నేపథ్యంలో ఒక దోషి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసినందున జనవరి 22న ఉరిశిక్ష అమలు జరగదని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. జైళ్ల నిబంధనల ప్రకారం.. ఉరి శిక్షను అమలు చేయలేమని బుధవారం పేర్కొంది.
ఇక ప్రొటోకాల్ ప్రకారం.. తొలుత దోషి క్షమాభిక్ష అర్జీని ఢిల్లీ ప్రభుత్వానికి పంపిస్తారు. అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు చేరుతుంది. ఆ తర్వాత కేంద్ర హోం శాఖకు పంపిస్తారు. ఈ క్రమంలో అన్ని స్థాయిల్లోనూ సదరు అర్జీని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే అది దోషి తరఫు అర్జీగా రూపాంతరం చెందుతుంది. అనంతరం రాష్ట్రపతికి చేరిన తర్వాత క్షమాభిక్షపై రాష్ట్రపతి తన అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటారు.(నిర్భయ దోషులు : పలు సంచలన విషయాలు)
కాగా దేశ రాజధాని ఢిల్లీలో 2012, డిసెంబర్ 16న అర్ధరాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై కదులుతున్న బస్సులో ఆరుగురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రాణాల కోసం పోరాడి చివరకు బాధితురాలు సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో కన్నుమూసింది. దీంతో దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆమెకు నిర్భయగా నామకరణం చేసిన పోలీసులు.. నిందితులు రామ్‌సింగ్, అక్షయ్, వినయ్ శర్మ, పవన్, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని అరెస్టు చేశారు. విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు(అతనిపై నిఘా కొనసాగుతుంది). అనేక పరిణామాల అనంతరం మిగిలిన నలుగురు దోషులకు సుప్రీంకోర్టు మరణ శిక్ష విధించింది. (క్షమాభిక్ష పెట్టండి!)
Comments
Please login to add a commentAdd a comment