
ఎయిర్ కూలర్ చల్లదనంలో చింపాంజీ
భువనేశ్వర్ : రాష్ట్రంలో ప్రముఖ జంతు ప్రదర్శన శాలగా పేరొందిన బారంగ్ నందన్ కానన్ ప్రాంగణంలో వన్య ప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఇటీవల కాలంలో ఎండల తీవ్రత అకస్మాత్తుగా పెరిగింది. వన్యప్రాణులను వడ దెబ్బ నంచి నివారించేందుకు జూ అధికార వర్గాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి.
ప్రధానంగా వన్య ప్రాణుల పంజరాల ప్రాంగణాల్లో చల్లని వాతావరణం కల్పించేందుకు భారీ సన్నాహాలు చేస్తున్నారు. వన్య ప్రాణులు తిరుగాడే పరిసరాల్లో జలాశయాలు ఏర్పాటు చేయడం, తాగు నీరు సదుపాయాల్ని కల్పించడం వంటి ఏర్పాట్లతో సంరక్షిస్తున్నారు.
సున్నితమైన వన్య ప్రాణులు, పక్షుల పంజరాల పరిసరాల్లో ఐస్ క్యూబ్‌లు అమరుస్తున్నారు. ఎండ వేడిమి తాకకుండా నీడ కల్పించేందుకు పలు చోట్ల గడ్డి చాపలు, ఎయిర్ కూలర్లను అమర్చుతున్నారు.
రాత్రింబవళ్లు వాతావరణం చల్లగా ఉండేందుకు పంజరాల్లో పిచికారితో నీరు చిమ్మడం, జలాశయాల్లో నీటి మట్టం నిర్వహణ వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చింపాంజీలు వంటి సున్నిత వన్య ప్రాణుల పంజరాల ప్రాంగణాల్లో ఎయిర్ కూలర్లను అమర్చారు.
చల్లని ఆహారం
వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత పుంజుకుంటోంది. ఈ పరిస్థితుల్లో వన్య ప్రాణుల శరీరానికి చల్లదనం కూర్చే ఆహార పదార్థాల్ని సరఫరా చేస్తున్నారు. నిత్య ఆహార పదార్థాలతో పాటు దోస కాయలు, పుచ్చ కాయలు, చెరుకుగడలు వంటి ప్రత్యేక పదార్థాల్ని జోడించారు.
తాగేందుకు చల్లని నీటి ప్రవాహం ఏర్పాటు చేశారు. జంతువులను వడ దెబ్బ ప్రమాదాల నుంచి కాపాడేందుకు చేపడుతున్న కార్యాచరణలో నందన్ కానన్ పరిసరాల్లో హరిత పర్యావరణం ఏమాత్రం ప్రభావితం కాకుండా జాగ్రత్త వహిస్తున్నారు.
వేసవిలో వాతావరణ సంబం ధిత అనారోగ్య పరిస్థితులు వన్యప్రాణులను ఆవరించకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్ని చేపడుతున్నారు. ప్రత్యేక వన్యప్రాణుల చికిత్స బృందం ఈ మేరకు కృషి చేస్తుందని నందన్ కానన్ పర్యాటకుల నిర్వహణ విభాగం సహాయ అటవీ సంరక్షణ అధికారి అమూల్య కుమార్ ఫరిడ తెలిపారు.

జలాశయంలో సేద తీరుతున్న తెల్ల పెద్ద పులి
Comments
Please login to add a commentAdd a comment