
విలన్.. టెర్రరిస్టు ఇస్మాయెల్
► అమర్‌నాథ్ ఉగ్ర దాడి ప్రధాన సూత్రధారిగా నిర్ధారణ
► స్థానిక ఉగ్రవాదుల సహకారం
► దాడిని ఖండించిన ప్రపంచ దేశాలు
► మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.7 లక్షల పరిహారం
మంచు కొండల్లో కొలువైన మహా శివ లింగాన్ని దర్శనం చేసుకుని సంతోషంతో తిరిగివస్తున్న అమర్‌నాథ్ యాత్రికుల బస్సుపై బుల్లెట్ల వర్షం కురిపించి ఏడుగురు అమాయక భక్తుల మరణానికి కారణమైన లష్కరే ఉగ్రవాది ఇస్మాయెల్. కాగా, దూసుకొస్తున్న బుల్లెట్లకు భయపడక, సీట్ల కింద దాక్కోవాలని ఒకవైపు ప్రయాణికులకు సూచిస్తూ నే.. వేగంగా బస్సును మందుకు నడిపి 53 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడింది ఆ బస్సు డ్రైవర్ సలీమ్ షేక్. వీరిద్దరిలో ఒకరు హింసకు, అమానుషత్వానికి ప్రతీకగా నిలవగా.. మరొకరు ధైర్యానికి, మానవత్వానికి మరోపేరయ్యారు. నా దేవుడే నాకీ ధైర్యాన్నిచ్చాడని సలీం చెప్పడం కొసమెరుపు.
శ్రీనగర్/న్యూఢిల్లీ: మంచుకొండల్లో ముష్కర దాడికి ప్రధాన సూత్రధారి పాకిస్తాన్ ఉగ్రవాది ఇస్మాయెల్ అని జమ్మూ కశ్మీర్ పోలీసులు తేల్చారు. ఏడుగురు అమర్‌నాథ్ యాత్రికుల్ని పొట్టనబెట్టుకున్న ఈ ఉగ్రదాడిలో అసలు విలన్ అతనేనని, కశ్మీర్‌లో లష్కరే ఉగ్రకార్యకలాపాల్లో గత కొద్ది కాలంగా ఇస్మాయెల్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసు వర్గాలు నిర్ధారించాయి. సోమవారం రాత్రి అనంతనాగ్ జిల్లాలో అమర్‌నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రదాడికి వ్యూహరచన చేయడంతో పాటు స్వయంగా అతను పాల్గొన్నాడని గుర్తించారు.
దాడిలో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నారని, వారిలో ఇస్మాయెల్ మోటార్ బైక్‌పై నుంచి విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కశ్మీర్‌లో లష్కరే కార్యకలాపాలకు అబు దుజానా చీఫ్‌గా ఉండగా.. అతని తర్వాతి స్థానం ఇస్మాయెల్‌దే. అతనికి హిజ్బుల్ మొజాహిదీన్ ఉగ్రవాదుల మద్దతు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా దాడిలో హిజ్బుల్ మొజాహిదీన్‌తో పాటు స్థానిక ఉగ్రవాదు ల హస్తం కూడా ఉండొచ్చని సీఆర్‌పీఎఫ్ బలగాలు అనుమానం వ్యక్తం చేశాయి.
త్వరలోనే మట్టుబెడతాం..
మంగళవారం ఉదయం జమ్మూ కశ్మీర్ ఐజీ మునీర్ ఖాన్ మాట్లాడుతూ.. దాడికి పాల్పడ్డ ప్రధాన సూత్రధారుడ్ని ఇస్మాయెల్‌గా గుర్తించామని, ఇస్మాయెల్‌కు స్థానిక ఉగ్రవాదులు సాయపడ్డారని చెప్పారు. ఇస్మాయెల్ గురించి పూర్తి వివరాలు తెలియలేదని, అతను పాకిస్తాన్ జాతీ యుడని ఆయన తెలిపారు.
‘ఇస్మాయెల్‌తో మరో ఇద్దరు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. మరో ఉగ్రవాదిని అబూ దుజానాగా గుర్తించాం. వారిని దాడి ప్రాంతానికి తీసుకురావడంతో పాటు ఆయుధాల్ని సరఫరా చేసిన వ్యక్తులెవరో తెలిసింది. దాడి సమయంలో ముగ్గురు ఉగ్రవాదులతో పాటు వారు కూడా అక్క డే ఉన్నారు. ఉగ్రవాదులు ఎటువైపు పారి పోయారో గుర్తించాం. వేట కొనసాగిస్తున్నాం. త్వరలో మట్టుబెడతాం’ అని కశ్మీర్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. పోలీసులు ఇస్మాయెల్ ఫొటోను విడుదల చేశారు.
ప్రారంభమైన యాత్ర
మరోవైపు, ఉగ్రదాడికి వెరవకుండా మంగళవారం 22,633 మంది భక్తులు జమ్మూ, శ్రీనగర్‌ల నుంచి అమర్‌నాథ్ యాత్రను ప్రారంభించారు. యాత్రి కుల వాహనశ్రేణికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని జమ్మూ డివిజనల్ కమిషనర్ చెప్పారు.