కార్మికుల కడుపుకొడుతున్న కరోనా | corona Effects On Daily Wage Workers | Sakshi
Sakshi News home page

కార్మికుల కడుపుకొడుతున్న కరోనా

Published Sat, Mar 21 2020 2:18 PM | Last Updated on Sat, Mar 21 2020 2:24 PM

corona Effects On Daily Wage Workers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశానికి వాణిజ్య రాజధానిగా ప్రసిద్ధి చెందిన ముంబై నగరం కరోనా ప్రభావంతో పూర్తిగా బోసిపోయింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన వలస కార్మికులకు అక్షయ పాత్రగా ఆదుకున్న నగరం ఇప్పుడు వారి పొట్టలను కొట్టి నగరం నుంచి తరిమేస్తోంది. ఫలితంగా శుక్ర, శనివారాల్లో ముంబై సబర్బన్‌లోని బాండ్ర టెర్మినస్‌ వలస కార్మికులతో కిక్కిర్సి పోయింది. తిరుగు ప్రయాణికులతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. అందరి ముఖాలకు మాస్క్‌లు కనిపిస్తున్నాయి. కొందరు నిర్మాణ పనుల్లో ధరించే ధూళి నిరోధక మాస్క్‌లు ధరించగా, మరికొందరు క్లినికల్‌ మాస్క్‌లు, ఇంకొందరు రంగు రంగుల కర్చీఫ్‌లు ధరించారు. (271కి చేరిన కరోనా బాధితుల సంఖ్య)

కరోనా వైరస్‌ నిరోధక చర్యల్లో భాగంగా ముంబైతోపాటు పుణే, పింప్రీ, చించ్‌వాడ్, నాగపూర్‌ ప్రాంతాల్లో అన్ని రకాల పనులను ప్రభుత్వ అధికారులు నిలిపి వేయడం, కూలీల అడ్డాల్లో కూలీలు గుమికూడదంటూ పోలీసులు అడ్డుకోవడం, ఫలితంగా పనులు దొరక్కా పస్తులుండాల్సి రావడంతో రోజువారి కూలీలు తిరుగుముఖం పట్టారు. ‘ఆరు నెలల క్రితం ముంబై వచ్చాను. అంధేరి ప్రాంతంలో ప్లంబర్‌గా పని చేస్తున్నాను. అడ్డాలో నిలబడితే రోజూ ఎవరో ఒక కాంట్రాక్టర్‌ తీసుకెళ్లేవారు. రోజుకు 500 రూపాయల నుంచి 600 రూపాయలు వరకు వచ్చేవి. గత మంగళవారం నుంచి ఒక్క పైసా సంపాదన లేదు. అందుకని సొంత నగరమైన ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌కు వెళుతున్నాను’ అని 17 ఏళ్ల విశాల్‌ కుమార్‌ మౌర్య మీడియాకు తెలిపారు. (11 వేలు దాటిన కరోనా మృతులు)

‘వైరస్‌తోనైనా యుద్ధం చేయవచ్చుగానీ ఆకలితో యుద్ధం చేయలేము’ అని ముఖానికి నల్లటి గుడ్డను ధరించిన ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ల క్రితం రాజస్థాన్‌ నుంచి ముంబైకి బతుకుతెరువు కోసం వచ్చి ఆటో నడుపుకుంటోన్న 35 ఏళ్ల లలిత్‌ చౌహాన్‌ తెలిపారు తనకు రోజుకు 450 రూపాయలు వచ్చేవని, వాటితో తన జీవితం గడచిపోయేదని చెప్పారు. గత వారం రోజులుగా రోజుకు రెండు వందల రూపాయలు కూడా రావడం లేదని, అందుకనే ముంబై విడిచి వెనక్కి వెళిపోతున్నానని ఆయన చెప్పారు. దాదాపు ముంబైకి వీడ్కోలు చెబుతున్న అందరి పరిస్థితి ఇలాగే ఉంది. ఒక్క ముంబైలోనే కాకుండా కరోనా బారిన పడిన ప్రతి నగరంలోనూ దినసరి కూలీల పరిస్థితి ఇలా దారుణంగానే ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement