అసనసోల్(పశ్చిమబెంగాల్) : ప్రజల ప్రాణాలకోసం వైద్యసిబ్బంది, పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నా అవేమి పట్టని కొంతమంది వాళ్లపైనే తిరగబడి దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లోని పోచారులియా ప్రాంతంలో స్థానికుల దాడిలో ఐదుగురు పోలీసులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని క్వారంటైన్‌గా మార్చాలన్న సూచన మేరకు తనిఖీల కోసం ఆ ప్రాంతాన్ని వైద్యాధికారులు సందర్శించారు.
అయితే ఆ ఆరోగ్య కేంద్రాన్ని క్వారంటైన్ సెంటర్‌గా మార్చొద్దంటూ కొన్ని అల్లరి మూకలు అడ్డుకున్నాయి. సదరు అధికారులపై దుర్భాషలాడుతూ దాడికి యత్నించడంతో పరిస్థితి అదుపు తప్పింది. దాంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడ చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే యత్నం చేశారు. కాగా, ఈ క్రమంలోనే ఆ నిరసన కారులు రాళ్ల దాడికి దిగడంతో పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు.
దీంతో పరిస్థితిని నియంత్రించేందుకు లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్‌ను ప్రయోగించాల్సి వచ్చిందని సీనియర్ అధికారి తెలిపారు. కొంతమంది స్థానికులకు కూడా స్వల్ప గాయాలు అయినట్లు చెప్పారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, దీని వెనుక ఉన్న కుట్రదారులను పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా బర్ధమాన్ జిల్లాలోని అసన్సోల్ ప్రాంతంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదుకావడంతో ఈ ప్రాంతాన్ని క్వారంటైన్ సెంటర్‌గా మర్చాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment