
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మృత్యుఘోష ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. బుధవారం నుంచి గురువారం వరకు ఒక్క రోజు వ్యవధిలో 5,609 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 132 మంది కోవిడ్‌తో మరణించారు. దీంతో దేశంలో ఇప్పటిదాకా పాజిటివ్ కేసులు 1,12,359కి, మొత్తం మరణాలు 3,435కి చేరాయని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 63,624 కాగా, 45,299 మంది బాధితులు చికిత్సతో కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 40.32 శాతానికి చేరడం కొంత ఉపశమనం కలిగిస్తోంది.దేశంలో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా గురువారం పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ప్రభుత్వ మర్గదర్శకాల ప్రకారం లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు.
ఆ ఆస్పత్రి.. కరోనా శ్మశానం
గుజరాత్‌లోని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి ‘కరోనా శ్మశానం’గా మారింది. గుజరాత్‌లో కోవిడ్‌తో 749 మంది కన్నుమూయగా, అందులో దాదాపు సగం.. అంటే 351 మరణాలు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో మరణించారు. ఈ హాస్పిటల్‌లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
మహారాష్ట్రలో రైలు టికెట్లు క్యాన్సిల్
ప్రత్యేక రైళ్లలో మహారాష్ట్రలో మాత్రమే ప్రయాణించే వారి టికెట్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం అంతర్ జిల్లా ప్రయాణాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment