![Coronavirus cases in India Total 52952 And 1783 Lifeless - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/8/coronavirus.jpg.webp?itok=cxkhljAI)
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కల్లోలం ఆగడం లేదు. మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగుతోంది. దేశంలో కరోనా కేసులు 50 వేల మార్కును దాటేశాయి. బుధవారం నుంచి గురువారం వరకు ఒక్కరోజులో 89 మంది కోవిడ్‌తో మరణించారు. కొత్తగా 3561 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంమరణాల సంఖ్య 1,783కు, కేసుల సంఖ్య 52,952కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. యాక్టివ్ కరోనా కేసులు 35,902. ఇప్పటివరకు 15,266 మంది కోవిడ్ బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 28.83 శాతానికి పెరిగిందని ఆరోగ్యశాఖ అధికార వర్గాలు తెలిపాయి. పాజిటివ్ కేసులు రెట్టింపు కావడానికి ప్రస్తుతం 11 రోజులు పడుతోంది. కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌లో అత్యధికంగా నమోదవుతున్నాయి.
13 రాష్ట్రాలు, యూటీల్లో జీరో
దేశంలో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులేవీ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ చెప్పారు. కేరళ, ఒడిశా, జమ్మూకశ్మీర్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మిజోరం, మణిపూర్, గోవా, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ కేసులు రాలేదన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచుతున్నామని చెప్పారు. ఇప్పటిదాకా 13,57,442 పరీక్షలు నిర్వహించామన్నారు. సరిహద్దు భద్రతా దళానికి(బీఎస్‌ఎఫ్) చెందిన ఇద్దరు జవాన్లు కోవిడ్ కారణంగా మరణించారని, ఈ దళంలో కొత్తగా 41 మందికి కరోనా వైరస్ సోకిందని అధికారులు గురువారం చెప్పారు. కరోనా వైరస్ బాధితులకు గంగా నదీ జలంతో చికిత్స అందించడంపై అధ్యయనం (క్లినికల్ స్టడీస్) చేయాలన్న కేంద్ర జలశక్తి శాఖ ప్రతిపాదనపై ముందుకెళ్లకూడదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) గురువారం నిర్ణయించింది. దీనిపై శాస్త్రీయమైన సమాచారం అవసరమని స్పష్టంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment