(సాక్షి, వెబ్‌డెస్క్) : కరోనా వైరస్.. కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి ఇప్పుడు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి బారి నుంచి ప్రజలను కాపాడేందుకు దేశాధినేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇక శాస్త్రవేత్తలు సైతం ఈ ప్రాణాంతక వైరస్‌కు విరుగుడు కనిపెట్టేందుకు పరిశోధనలు మొదలుపెట్టారు. క్లినికల్ ట్రయల్స్‌కు కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టీకాను వేయించుకుంటున్నారు. అయితే చికిత్స కంటే నివారణే ముఖ్యం అన్న ఉద్దేశంతో వివిధ దేశాల ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటిస్తున్నాయి. భారత్‌లో సైతం పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అసలు లాక్‌డౌన్ అంటే ఏమిటి? లాక్‌డౌన్ చేస్తే జనజీవనం పూర్తిగా స్తంభించిపోయినట్టేనా? ఆ సమయంలో ఎటువంటి సేవలు అందుబాటులో ఉంటాయి? వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
లాక్‌డౌన్ అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలను నివారించడం. బాహ్య ప్రదేశాల నుంచి ఏదైనా ముప్పు ముంచుకు వస్తున్న తరుణంలో లేదా ఇతర బాహ్య ప్రమాదాల నుంచి రక్షించడానికి లాక్‌డౌన్ ప్రయోగిస్తారు. అధికార యంత్రాంగం మాత్రమే ఈ ప్రోటోకాల్‌ను ఉపయోగించే వెసులుబాటు ఉంటుంది. ఇక భవనాలలో లాక్‌డౌన్ అంటే తలుపులకు తాళాలు వేయడం. దీనివల్ల ఏ వ్యక్తి లోపలికి రారు, బయటికి పోరు. అదేవిధంగా పూర్తి స్థాయి లాక్‌డౌన్ (ఫుల్ లాక్‌డౌన్) అంటే సాధారణంగా ప్రజలు వారు ఉన్న చోటనే ఉండాలి.
లాక్‌డౌన్ రెండు రకాలు
1. నివారణ లాక్‌డౌన్ (ప్రివెంటివ్ లాక్‌డౌన్)
2. రెండోది ఎమర్జెన్సీ లాక్‌డౌన్
ప్రజలు, సంస్థల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా విధించేది ప్రివెంటివ్ లాక్‌డౌన్. అసాధారణమైన పరిస్థితి లేదా విపత్తును పరిష్కరించడానికి అమలు చేసే ముందస్తు చర్య ఇది. నివారణ చర్యలలో భాగం. ముంచుకొచ్చే ముప్పు తీవ్రతను తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రాణాలకు తక్షణ ముప్పు లేదా ఇతరత్రా ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు ఎమర్జెన్సీ లాక్ డౌన్‌ను విధిస్తారు.
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యలు
► చికిత్స కంటే నివారణే మేలు
► తుమ్మినపుడు, దగ్గినపుడు మోచేయిని మడిచి అడ్డుపెట్టుకోవాలి
► మాస్కులు ధరించాలి
► చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలి
► హ్యాండ్‌వాష్, శానిటైజర్లు ఉపయోగించాలి
► వ్యక్తిగత శుభ్రత పాటించాలి
► అధిక మొత్తంలో మంచినీరు తాగాలి
► వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి
► ఇంట్లోనే చిన్నపాటి వ్యాయామాలు చేస్తే మంచిది
► సామాజిక దూరం పాటించాలి
► ఇంట్లో వాళ్లతో కూడా వీలైనంత(ఆరు అడుగుల దూరం)ఎడంగా ఉండాలి
► ఆలింగనాలు, షేక్‌హ్యాండ్లకు దూరంగా ఉండాలి.. భౌతికదూరం పాటిస్తే మరీ మంచిది
► పౌష్టిక, సాత్వికాహారం తీసుకుంటే మంచిది
► స్వీయ నిర్బంధంలో ఉండటం ఉత్తమం
► డయాబెటిస్, హృద్రోగం వంటివి ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి
కరోనా వైరస్ లక్షణాలు
► పొడిదగ్గు, జలుబు , గొంతు నొప్పి , జ్వరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం
► అయితే అన్ని రకాలు జలుబులు కరోనా కాకపోవచ్చు. కాకపోతే ముందు జాగ్రత్త చర్యగా వైద్యులను సంప్రదించాలి
కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి
► ఆస్పత్రికి వెళ్లే వెసలుబాటు లేనట్లయితే హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేసి శాంపిల్స్ తీసుకువెళ్లమని కోరాలి
► అసత్య ప్రచారాలు నమ్మి గందరగోళానికి గురికాకూడదు
► ముఖ్యంగా వృద్ధులకు ఈ కరోనా వైరస్‌తో ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకోవాలి.
అన్నింటికంటే ముఖ్యమైనది సానుకూల దృక్పథం.. కరోనా పాజిటివ్‌గా తేలినవారు ఎంతో మంది ప్రస్తుతం కోలుకుంటున్నారు. కాబట్టి భయాన్ని వదిలి జాగ్రత్తగా వ్యవహరిస్తే దీని బారి నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా కరోనా పురుడుపోసుకున్న చైనాలోని వుహాన్ నగరం ప్రస్తుతం కోలుకుంటున్న తీరును స్ఫూర్తిదాయకంగా తీసుకుని భయాన్ని విడనాడాలి.
Comments
Please login to add a commentAdd a comment