కోట్ల రూపాయలతో జంట జంప్
తిరువళ్లూరు(తమిళనాడు): ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోట్లలో వందలమందికి కుచ్చుటోపీ పెట్టారు. చిట్టీల పేరిట వందల మంది నుంచి డబ్బు కట్టించుకోని ఏకంగా రూ.ఆరు కోట్లతో ఓ జంట ఉడాయించింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలోని తిరుపాళయవనం గ్రామానికి చెందిన ముత్తుకుమార్, భార్య ప్రియ ఆమె బంధువు మేఘనాథన్ కలిసి పదేళ్లుగా చిట్టీలను నిర్వహిస్తున్నారు.
దాదాపు రెండు వందల మందితో రెండు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు చిట్టీలను నడుపుతున్నారు. అయితే, గత రెండు నెలల నుంచి చిట్టీ పాడిన వారికి నగదు ఇవ్వడం లేదు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు ఇంటి వద్దకు వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. సమీపంలో ఉన్న వారిని విచారించగా వారు ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారని బదులిచ్చారు. దీంతో షాక్ తిన్న బాధితులు మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు ఆరు కోట్ల రూపాయల మేర వారు చెల్లించాల్సి ఉంటుందని బాధితులు ఫిర్యాదులో వివరించారు. ఈ ఘటనపై ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.