కోదాడ: కోదాడ కేంద్రంగా జరుగుతున్న చిట్టీ వ్యాపారుల మోసాలకు తెరపడడం లేదు. అవసరానికి ఉపయోగపడతాయని రూపాయి.. రూపాయి జమ చేస్తున్న సామాన్యులను చిట్టీల వ్యాపారులు నిండా ముంచుతున్నారు. 20 నుంచి 30 సంవత్సరాలు ఇదే వ్యాపారం చేస్తున్న ఇద్దరు వ్యాపారులు సామాన్యులకు దాదాపు రూ.25కోట్లు కుచ్చుటోపి పెట్టారు.
నాలుగు సంవత్సరాల క్రితం కోదాడకు చెందిన సేవా చిట్స్ యజమాని రూ.20కోట్లు చెల్లించకుండా మొహం చాటేయగా.. తాజాగా మరో వ్యాపారి దాదాపు రూ.6కోట్ల మేర ఐపీ పెడుతున్నట్లు సమాచారం. ఒక చిట్టీ నిర్వహణకు మాత్రమే అనుమతి తీసుకొని పదుల సంఖ్యలో చిట్టీలను నడుపుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.
తెలివిగా తప్పించుకుంటున్నారు..
రిజిస్టర్ చిట్టీ ఒకటి మాత్రమే అనుమతి తీసుకొని కోట్ల రూపాయలు చిట్టీలు నడుపుతున్న వీరు బోర్డు తిప్పేస్తే బాధితులకు చిల్లిగవ్వ కూడా రావడం లేదు. అజ్ఞాతంలోకి వెళ్లడానికి ముందే వీరు తమ ఆస్తులను ఇతరులకు గుట్టచప్పుడు కాకుండా అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు.
న్యాయస్థానాలను ఆశ్రయించి ఐపీ దాఖలు చేస్తుండడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కోర్టులకు చేరుతున్న వ్యవహారం సంవత్సరాల తరబడి తేలకపోవడంతో బాధితులు పూర్తిగా నష్టపోతున్నారు.
కోదాడలో ఇలా ఒక చిట్టీకి మాత్రమే అనుమతి తీసుకొని పదుల సంఖ్యలో చిట్టీలను నడుపుతున్న సంస్థలు పదుల సంఖ్యలో ఉన్నాయని వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment