chit cheeting
-
చిట్టీల పేరుతో సామాన్యులకు టోకరా.. పక్కా ప్రణాళికతోనే మోసం చేస్తున్న వ్యాపారులు!
కోదాడ: కోదాడ కేంద్రంగా జరుగుతున్న చిట్టీ వ్యాపారుల మోసాలకు తెరపడడం లేదు. అవసరానికి ఉపయోగపడతాయని రూపాయి.. రూపాయి జమ చేస్తున్న సామాన్యులను చిట్టీల వ్యాపారులు నిండా ముంచుతున్నారు. 20 నుంచి 30 సంవత్సరాలు ఇదే వ్యాపారం చేస్తున్న ఇద్దరు వ్యాపారులు సామాన్యులకు దాదాపు రూ.25కోట్లు కుచ్చుటోపి పెట్టారు. నాలుగు సంవత్సరాల క్రితం కోదాడకు చెందిన సేవా చిట్స్ యజమాని రూ.20కోట్లు చెల్లించకుండా మొహం చాటేయగా.. తాజాగా మరో వ్యాపారి దాదాపు రూ.6కోట్ల మేర ఐపీ పెడుతున్నట్లు సమాచారం. ఒక చిట్టీ నిర్వహణకు మాత్రమే అనుమతి తీసుకొని పదుల సంఖ్యలో చిట్టీలను నడుపుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. తెలివిగా తప్పించుకుంటున్నారు.. రిజిస్టర్ చిట్టీ ఒకటి మాత్రమే అనుమతి తీసుకొని కోట్ల రూపాయలు చిట్టీలు నడుపుతున్న వీరు బోర్డు తిప్పేస్తే బాధితులకు చిల్లిగవ్వ కూడా రావడం లేదు. అజ్ఞాతంలోకి వెళ్లడానికి ముందే వీరు తమ ఆస్తులను ఇతరులకు గుట్టచప్పుడు కాకుండా అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించి ఐపీ దాఖలు చేస్తుండడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కోర్టులకు చేరుతున్న వ్యవహారం సంవత్సరాల తరబడి తేలకపోవడంతో బాధితులు పూర్తిగా నష్టపోతున్నారు. కోదాడలో ఇలా ఒక చిట్టీకి మాత్రమే అనుమతి తీసుకొని పదుల సంఖ్యలో చిట్టీలను నడుపుతున్న సంస్థలు పదుల సంఖ్యలో ఉన్నాయని వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
గురువుగా నమ్మించి.. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో
పలమనేరు(చిత్తూరు జిల్లా): ఓంశక్తి గురువుగా ప్రజలతో పరిచయం పెంచుకుని ఆపై చీటీలు వేస్తూ.. అధిక వడ్డీ ఆశ చూపి వందలాది మంది నుంచి రూ.25 కోట్లు వసూలు చేసిన వ్యక్తి కనిపించకుండా పోయిన ఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో చోటుచేసుకుంది. బాధితులు ఆదివారం పలమనేరు డీఎస్పీ గంగయ్యను కలసి ఈ మేరకు గోడు వెళ్లబోసుకున్నారు. వారి కథనం ప్రకారం.. బాపట్లకు చెందిన గండికోట ఆంజనేయులు 20 ఏళ్ల క్రితం బంగారుపాళేనికి వచ్చి నెహ్రూ వీధిలో ఓంశక్తి భక్తునిగా సేవలు చేసేవాడు. శక్తి పేరిట ఓ ఆలయాన్ని సైతం దాతల సాయంతో నిర్మించి అక్కడ నిత్యాన్నదానం చేయడం ప్రారంభించాడు. చదవండి: అమ్మాయిల సంఖ్య ‘అనంత’లోనే తక్కువ.. ఎందుకిలా? ఇలా భక్తులను పెంచుకుని వారితో మాల వేయిస్తూ ఏటా మేల్మరుత్తూర్ ఆదిపరాశక్తి గుడికి వందల సంఖ్యలో బస్సుల్లో తీసుకెళ్లేవాడు. ఇలా ప్రజల్లో నమ్మకం పెంచుకొని ఓంశక్తి పేరుతో చీటీల వ్యాపారం మొదలుపెట్టాడు. దీంతో పాటు అధికవడ్డీ ఇస్తానంటూ పలువురి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నాడు. వారికి చెల్లని చెక్కులను అంటగట్టాడు. నాలుగు రోజుల క్రితం అతని ఇంటికి తాళం వేసి ఉండటంతో పలువురు ఆయనకు ఫోన్చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆయన సొంతూరైన బాపట్ల వెళ్లి ఆరా తీసినా ఆచూకీ దొరకలేదు. అతను ఇచ్చిన చెక్కుల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పేరు రాసి మోసం చేసినట్టు గుర్తించారు. దీంతో డబ్బులు పోగొట్టుకున్నామని భావించిన బాధితులు ఆదివారం డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. బంగారుపాళేనికి చెందిన లీలమ్మ నుంచి రూ.97 లక్షలు, డి.కిశోర్ నుంచి రూ.50 లక్షలు, రమేష్ నుంచి రూ.34 లక్షలు ఇలా సుమారు 200 మంది నుంచి రూ.25 కోట్లకు పైగా డబ్బులు తీసుకున్నట్టు బాధితులు డీఎస్పీకి తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని బంగారుపాళెం ఎస్ఐని డీఎస్పీ ఆదేశించారు. -
కోట్ల రూపాయలతో జంట జంప్
తిరువళ్లూరు(తమిళనాడు): ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోట్లలో వందలమందికి కుచ్చుటోపీ పెట్టారు. చిట్టీల పేరిట వందల మంది నుంచి డబ్బు కట్టించుకోని ఏకంగా రూ.ఆరు కోట్లతో ఓ జంట ఉడాయించింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలోని తిరుపాళయవనం గ్రామానికి చెందిన ముత్తుకుమార్, భార్య ప్రియ ఆమె బంధువు మేఘనాథన్ కలిసి పదేళ్లుగా చిట్టీలను నిర్వహిస్తున్నారు. దాదాపు రెండు వందల మందితో రెండు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు చిట్టీలను నడుపుతున్నారు. అయితే, గత రెండు నెలల నుంచి చిట్టీ పాడిన వారికి నగదు ఇవ్వడం లేదు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు ఇంటి వద్దకు వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. సమీపంలో ఉన్న వారిని విచారించగా వారు ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారని బదులిచ్చారు. దీంతో షాక్ తిన్న బాధితులు మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు ఆరు కోట్ల రూపాయల మేర వారు చెల్లించాల్సి ఉంటుందని బాధితులు ఫిర్యాదులో వివరించారు. ఈ ఘటనపై ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.