
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను భారత ప్రభుత్వం విపత్తుగా ప్రకటించింది. రాష్ట్ర విపత్తు సహాయనిధి కింద సహాయం అందించేందుకు వీలుగా కోవిడ్-19ను విపత్తుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్రం హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు కేంద్ర ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.4లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. కాగా, కర్ణాటకలోని కలబుర్గి, ఢిల్లీలో కరోనాతో ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే.
భారత్‌లో ప్రస్తుతం 84 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా 5 వేలకు పైగా బాధితులు మరణించగా.. 1,45, 810 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక కోవిడ్ భయాల నేపథ్యంలో అప్రమత్తమైన పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టాయి. ఢిల్లీ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు పాఠశాలు, కళాశాలలకు మార్చి 31 వరకు సెలవులు ప్రకటించాయి... షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లను మూసివేశాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నెల ఆఖరు వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment