
సంకుచిత బుద్ధితోనే విభజన
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న సంకుచిత బుద్ధితోనే ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని సీపీఎం మండిపడింది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ ఏర్పాటుచేయాలని కాంగ్రెస్, యూపీఏ తీసుకున్న నిర్ణయాన్ని సీపీఎం తప్పుపట్టింది. ఢిల్లీలో శని, ఆదివారాల్లో జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో చర్చించిన పలు అంశాలను, తీసుకున్న నిర్ణయాలను సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ సోమవారం విలేకరులతో వెల్లడించారు. భాషాప్రయుక్త రాష్ట్రాలను విభజించరాదన్నది తమ విధానమని, దానికే కట్టుబడి ఉన్నామని స్పష్టీకరించారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన వల్ల కోస్తాంధ్ర, రాయలసీమల్లో సమైక్యాంధ్ర కోసం ఉద్యమం తలెత్తిందన్నారు.
రాష్ట్ర విభజనతో ముడిపడిన సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కోరారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయం అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనూ ఉద్యమాలను తిరిగి లేవనెత్తిందన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే మీ పార్టీ వైఖరేమిటని అడగ్గా.. తాము వ్యతిరేకించినా ఆ బిల్లు ఆగదన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించడం, అధిక ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, ధరల పెరుగుదల వంటివన్నీ యూపీఏ అధ్వాన ఆర్థిక విధానాల ఫలితమేనని, ఎఫ్‌డీఐలపై పరిమితులను సడలించాలన్న ప్రతిపాదనకూ తాము వ్యతిరేకమని కారత్ తెలిపారు. ఆహార భద్రత బిల్లు లోపభూయిష్టంగా ఉందని, పార్టీ ఎంపీలు పలు సవరణలు ప్రతిపాదించారన్నారు. కాశ్మీర్, బీహార్‌లో మతహింస ఘటనలు ఆందోళనకరమని, బీజేపీ-ఆరెస్సెస్ కారణంగానే ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయన్నారు.