ఢిల్లీలో ఈ ఉదయం జరిగిన సీపీఎం పోలిట్ బ్యూరో సమావేశ దృశ్యం
న్యూఢిల్లీ: ఏపీ నూతన రాజధాని నిర్మాణం పేరుతో చేస్తున్న భూసేకరణను తక్షణం ఆపాలని, లేకుంటే తాము ఉద్యమిస్తామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు హెచ్చరించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ నిర్ణయాలు, భూసేకరణ చట్టం గురించి పోలిట్బ్యూరోలో చర్చించినట్లు తెలిపారు. ఈ ఉదయం పోలిట్బ్యూరో సమావేశం ముగిసిన తరువాత రాఘవులు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం రాజధాని కోసం అన్యాయంగా భూ సేకరణ చేస్తోందన్నారు. భూ సేకరణకన్నా ల్యాండ్ పూలింగ్ మంచిదన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని విమర్శించారు.
మోదీ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వడంలేదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. పోలవరం ముంపు మండలాలు ఏపీలో ఉంటే, ప్రజాప్రతినిధులను తెలంగాణలో ఉంచారన్నారు. పోలవరం ముంపు మండలాలపై త్వరలోనే రాష్ట్రపతిని కలుస్తామని రాఘవులు చెప్పారు.