కాశ్మీర్ వరదల్లో ఇలాంటి బాధితులెందరో
ఆ రాష్ట్రం నుంచి క్రికెట్ ఆటగాళ్లంటే.. పెద్దగా ఎవరికీ తెలియరు. కానీ, ఒక్కసారిగా వాళ్లంతా హీరోలైపోయారు. జమ్ము కాశ్మీర్ రాష్ట్రం తరఫున ఆడే ఇయాన్ దేవ్ సింగ్ చౌహాన్, అతడి జట్టు సభ్యులు కలిసి కొంతమంది ప్రాణాలు కాపాడారు. ఈనెల ప్రారంభంలో చౌహాన్ జట్టు శ్రీనగర్లో జరిగే టీ20 మ్యాచ్ ఆడేందుకు వెళ్లింది. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో వర్షం మొదలైంది. వాళ్లున్న హోటల్లో రెండో అంతస్థు వరకు నీళ్లు వచ్చేశాయి. మొదటి రెండు రోజుల పాటు ఏం చేయాలో కూడా అర్థం కాక అలాగే ఉండిపోయారు.
మూడో రోజున కెప్టెన్ చౌహాన్, మరో ఇద్దరు కలిసి ఈదుకుంటూ 20 మీటర్ల దూరంలో ఉన్న షికారా బోటు వద్దకు వెళ్లారు. దాన్ని నడుపుకొంటూ హోటల్ వద్దకు వచ్చి, అందులోకి ఇతర జట్టు సభ్యులను, హోటల్లోనే ఉన్న మిగిలినవాళ్లను కాపాడారు. వీళ్లంతా కలిసి ఆ బోట్లో ఓ కొండగుట్ట మీదకు వెళ్లగలిగారు. అలాగే అక్కడ ఐదు రోజుల పాటు ఉండిపోయారు. తిండి, నీళ్లు కూడా లేవు. అయితే అదృష్టవశాత్తు హోటల్ నుంచి వచ్చేటప్పుడు కొన్ని దుస్తులు కూడా తెచ్చుకోవడంతో చలి నుంచి మాత్రం రక్షణ లభించింది. క్రికెట్ కిట్లను మాత్రం అక్కడే వదిలేశారు. చివరకు ఓ హెలికాప్టర్ వచ్చి వాళ్లను రక్షించింది.