* 24 మంది బీజేపీ, ఐదుగురు శివసేన సభ్యులపై అభియోగాలు
* ఏడీఆర్ వెలువరించిన జాబితాలో ఒవైసీ, బాల్క సుమన్ పేర్లు
సాక్షి, న్యూఢిల్లీ: పదహారవ లోక్‌సభకు ఎన్నికైన 541 మందిలో సభ్యుల్లో 53 మందిపై వివిధ నేరాభియోగాలున్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) పేర్కొంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 (1), సెక్షన్ 8 (3) కింద ఈ అభియోగాలు నమోదైనట్టు తమ పరిశీలనలో తేలిందని ఏడీఆర్ వెల్లడించింది. అభియోగాలున్న వారంతా దోషులుగా తేలితే లోక్‌సభ సభ్యత్వానికి అనర్హులవుతారని పేర్కొంది. నేరాభియోగాలు ఉన్న సభ్యుల్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, బీజేపీ ఎంపీలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ కూడా ఉన్నారని ఏడీఆర్ స్పష్టం చేసింది. ఏడీఆర్ వ్యవస్థాపక సభ్యుడు ప్రొఫెసర్ జగదీప్ చొక్కర్ శుక్రవారం ఢిల్లీలో మీడియాకు ఈ వివరాలు తెలిపారు.
- అభియోగాలున్న సభ్యులనుంచి పార్లమెంటుకు విముక్తి కల్పించేందుకు, పెండింగ్ కేసులను ఏడాదిలోపు తేల్చేయాలంటూ సుప్రీంను కోరదామంటూ ప్రధాని మోడీ ఇటీవలే పిలుపు ఇచ్చారని, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారని జగదీప్ చొక్కర్ గుర్తుచేశారు. క్రిమినల్ కేసులున్న 53 మంది సభ్యుల్లో 23మంది తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికైనవారని తెలిపారు.
- {పజాప్రాతినిధ్య చట్టం కింద నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో బీజేపీ ఎంపీలు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, మహేశ్ గిరి, నళిన్ కుమార్ ఖతిల్, సురేష్ అంగాడి, గణేశ్ సింగ్, ఎన్సీపీ ఎంపీ ప్రతాప్ సిన్హా భోంస్లే, పీఎంకే ఎంపీ ఎ.రాందాస్ ఉన్నారన్నారు.
- అభియోగాలున్న వారి జాబితాలో 24 మంది బీజేపీ సభ్యులు, ఐదుగురు శివసేన సభ్యులు ఉన్నారు. తృణమల్ నుంచి నలుగురు, ఏఐఏడీఎంకే, ఆర్జేడీల నుంచి ముగ్గురేసి సభ్యులు, సీపీఎంనుంచి ఇద్దరు ఉన్నారు. కాంగ్రెస్, జేఎంఎం, ఎల్జేపీ, ఎన్సీపీ, పీఎంకే, ఆర్‌ఎస్‌పీ, బీజేడీ, ఎంఐఎం, స్వాభిమాన్ పక్ష, టీఆర్‌ఎస్ పార్టీల నుంచి ఒక్కో సభ్యుడు ఈ జాబితాలో ఉన్నారు. ఇద్దరు ఇండిపెండెంట్‌లు ఉన్నారని జగదీప్ చొక్కర్ చెప్పారు.
- తెలంగాణలోని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై, టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్‌పై ఉన్న కేసులతో వారిపై అనర్హత వేటుపడే అవకాశం ఉందన్నారు.
క్రిమినల్ కేసుల్లో 53 మంది ఎంపీలు
Published Sat, Jun 21 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM
Advertisement
Advertisement