
కర్ఫ్యూ నీడలోకి మరికొన్ని ప్రాంతాలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నెల 16న అరిపథన్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు మృతి చెందడంతో మరోసారి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేర్పాటువాదులు అరిపథన్ ప్రాంతానికి ర్యాలీకి పిలుపునివ్వడంతో భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి. శుక్రవారం కర్ఫ్యూను మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బుడ్గాం జిల్లాలోని అరిపథన్, మాగం ప్రాంతాలలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వాని ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు 42 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీనగర్, అనంతనాగ్, పాంపోర్, షోపియన్, ఖాన్పుర, కలూస ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఘర్షణల్లో ఇప్పటివరకు ఇద్దరు భద్రతా సిబ్బందితో సహా మొత్తం 64 మంది మృతి చెందారు.