ధర్మశాల : జమ్మూ కాశ్మీర్ వరదల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు టిబెట్ ఆధ్యాత్మిక బౌద్ధమత గురువు దలైలామా గురువారం సంతాపం తెలిపారు. వరదల బీభత్సంతో సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టంపై ఆయన జమ్మూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు రాసిన ఓ లేఖలో తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగించవల్సిందిగా దలైలామా సూచించారు.
అలాగే వినాశకరమైన వైపరీత్యంతో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆయన సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు దలైలామా ట్రస్ట్ నుంచి విరాళం ప్రకటించారు. విరాళాన్ని ముఖ్యమంత్రి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్కు పంపించినట్లు ధర్మశాలలోని దలైలామా కార్యాలయం వెల్లడించింది. మరోవైపు భారీ వరదలతో అతలాకుతలమైన జమ్మూకాశ్మీర్లో బాధితులను ఆదుకునేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఇప్పటివరకూ వరద ప్రాంతాల్లో 77 వేలమంది బాధితులను రక్షించారు. మృతుల సంఖ్య 215కి పెరిగింది.
కాశ్మీర్ వరద మృతులకు దలైలామా సంతాపం
Published Thu, Sep 11 2014 10:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM
Advertisement