కమలానికి దళిత సెగ!
యూపీ, పంజాబ్ ఎన్నికలపై దయాశంకర్, ఉనా ఉదంతాల ప్రభావం!
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరిగే రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి దళిత నిరసనల సెగ తగిలేలా ఉంది. పంజాబ్ ఎన్నికల్లో భాగస్వామి శిరోమణి అకాలీదళ్‌తో కలసి మరో ఐదేళ్లు అధికారంలో కొనసాగడానికి, ఉత్తరప్రదేశ్‌లో అధికార పీఠం కైవసం చేసుకోవడానికి బీజేపీ వేసుకున్న అంచనాలు తలకిందులయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ నెల 11న గుజరాత్‌లోని గిర్‌సోమనాథ్ జిల్లా ఉనాలో ఆవు చర్మం ఒలిచారంటూ బాలు సర్వయా అనే దళితుడి కుటుంబ సభ్యులపై అగ్రవర్ణాలవారు దాడి చేయడం, దీనిపై దళితులు రాష్ట్రవ్యాప్తంగా భారీస్థాయిలో నిరసనకు దిగడం తెలిసిందే. యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతిని కించపరుస్తూ బీజేపీ నేత దయాశంకర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆ రాష్ట్రమంతటా దళితులను రోడ్డెక్కేలా చేశాయి.
రెండేళ్లుగా కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న కాషాయదళానికి పంజాబ్, యూపీ ఎన్నికల్లో విజయావకాశాలను ఈ రెండు పరిణామాలు గందరగోళపరచినట్లు కనిపిస్తోంది. పంజాబ్‌లో అత్యధిక శాతం(32 శాతం)గా ఉన్న దళితులు అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలను నిర్ణయిస్తారనడంలో సందేహం లేదు. 2007, 2012 నాటి ఎన్నికల్లో అకాలీ-బీజేపీ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన వీరు పై రెండు పరిణామాలతో దూరమైతే ఈ సిక్కు-హిందూ కూటమికి వరుసగా మూడో విజయం దక్కే అవకాశం ఉండదు. దళిత ఓట్లు తగ్గితే కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీల్చే ఓట్లు అకాలీ-బీజేపీ కూటమి విజయావకాశాలను దెబ్బతీస్తా యి. 2012 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పరిణామాలు, సామాజిక పొత్తుల వల్ల చర్మకారులైన చమార్లు పెద్ద సంఖ్యలో పాలక కూటమికి ఓట్లేయడంతో ప్రకాశ్ సింగ్ బాదల్ రెండోసారి సీఎం అయ్యారు.
యూపీలో మాయకు కొత్త బలం..
ఉత్తరప్రదేశ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)కి దళితులే పునాది. రాష్ట్ర జనాభాలో 21 శాతంగా ఉన్న వీరు ఎన్నికల్లో ‘బెహనీ’్జ మాయావతి ముఖ్యమంత్రి కావడానికి దోహదపడుతున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వీరు మిగిలిన హిందూ సమాజంలోని అత్యధికుల మాదిరిగానే బీజేపీకి ఓట్లేసి మోదీ ప్రధాని కావడానికి సాయపడ్డారు. మాయావతిపై బీజేపీ నేతలు చేస్తున్న అసభ్య వ్యాఖ్యలతో దళితులు మరోసారి ఆమెకు ద గ్గరైతే యూపీలో 15 ఏళ్ల విరామం తర్వాత అధికారంలోకి రావాలన్న బీజేపీ వ్యూహం, ఎత్తుగడలు ఫలించవు.