కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో ఫారూక్
సాక్షి, ముంబై : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఫరూక్ కు వీఐపీ ట్రీట్‌మెంట్ అందిన విషయం కలకలం రేపుతోంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో అతనికి పలువురు ప్రతినిధులు, అధికారులు సహకరించారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఫరూక్ పాస్‌పోర్ట్ రెన్యువల్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది.
2011 ఫిబ్రవరి 7న ఫరూక్ తక్లా తన పాస్ పోర్ట్ రెన్యువల్‌కు దరఖాస్తున్నాడు. అయితే కేవలం 24 గంటల్లోనే దానిని అధికారులు పూర్తి చేశారంట. పైగా ఇందుకోసం ఓ కాంగ్రెస్ పార్టీ కీలక నేత ముంబై పాస్‌పోర్టు అధికారులపై ఒత్తిడి తెచ్చాడని ఆ కథనం సారాంశం. ఆ సమయంలో విదేశాంగ మంత్రిగా ఉన్న ఎస్‌ఎం కృష్ణను, పి చిదంబరాన్ని ఈ వ్యవహారంపై బీజేపీ వివరణ కోరిందట. అయితే యూపీఏ మాత్రం అందుకు విముఖత వ్యక్తం చేసినట్లు ఆ కథనం పేర్కొంది.
కాగా, ముంబై పేలుళ్ల నిందితుడు అయిన యాసిన్ మన్సూర్ మహ్మద్ ఫరూక్ అలియాస్ ఫరూఖ్ తక్లాను సీబీఐ అధికారులు దుబాయ్‌లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చారు. 1993లో పేలుళ్ల తర్వాత దుబాయ్ పారిపోయిన ఫరూఖ్.. డీగ్యాంగ్‌లో క్రియాశీలక ఏజెంట్‌గా ఎదిగాడు. తీవ్రవాదం, అక్రమ మారణాయుధాల సరఫరా, నేరపూరిత కుట్రలు.. పలు అంశాలపై భారత్‌లో అతనిపై కేసులు నమోదయ్యాయి. 1995 లోనే ఇంటర్‌పోల్ అధికారులు ఫరూఖ్ తక్లాపై రెడ్ కార్నర్ నోటీస్ జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment