
అరుణ్ జైట్లీకి క్రికెటర్ల మద్దతు
న్యూఢిల్లీ:కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి క్రికెటర్ల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. గతంలో డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్) కు అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అవతవకలు జరిగాయనే ఆరోపణలను మాజీ క్రికెటర్ల్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, ఇషాంత్ శర్మలు ఖండించారు.డీడీసీఏకు అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆటగాళ్లకు ఆయన అండగా నిలిచేవారే తప్ప ఎటువంటి అవతవకలకు పాల్పడలేదని వారు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఢిల్లీ క్రికెట్ లో ఆటగాళ్ల ఎంపికకు సంబంధించి ఏమైనా చెప్పాల్సి ఉంటే ఆయన వద్దకు నేరుగా వెళ్లి తెలియజేసే వాళ్లమని సెహ్వాగ్ పేర్కొన్నాడు. కొంతమంది ఆయన్ను ఏదో భూతంలా చూపెడుతూ అనవసర రాద్దాంత చేస్తున్నారని సెహ్వాగ్ విమర్శించాడు.
ఇదిలా ఉండగా, అరుణ్ జైట్లీ అసందర్భంగా తప్పుబడుతున్నారని మరో భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ట్వీట్ చేశాడు. ఆయన హయాంలోనే ఢిల్లీ స్టేడియానికి ట్యాక్స్ మినహాయింపు లభించడంతో పాటు ఒక గుర్తింపు లభించిందన్నాడు. ఢిల్లీ ఆటగాళ్లకు ఏ సాయం కావాల్సి వచ్చినా ఆయన చాలా సాయంగా ఉండేవారని టీమిండియా పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ ట్విట్టర్ లో స్పందించాడు. ఆయన(సర్) ను తాను ఎప్పుడూ కలిసినా ఆటగాళ్ల మధ్య ఎటువంటి తారతమ్యాలు చూపెట్టకుండా ఎంతో హుందాగా వ్యహరించేవారన్నాడు.
అరుణ్ జైట్లీ డీడీసీఏ 2013 వరకూ 13 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారీ అవినీతికి పాల్పడ్డారని ప్రస్తుత కేజ్రీవాల్ సర్కార్ ఆరోపణలు ఎక్కుపెట్టింది. ఆయన వెంటనే కేంద్ర మంత్రికి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. డీడీసీఏ ఫైళ్లను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే తమపై కేంద్రం సీబీఐ దాడులకు ఉసిగొల్పిందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.