తిరువనంతపురం : ఉన్నత అధికారుల వేధింపుల వల్లే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని కేరళకు చెందిన ఓ పోలీసు అధికారి భార్య ఆరోపించారు. గిరిజనులమైన కారణంగానే తమకు ఈ దుస్థితి పట్టిందని ఆవేదన చెందారు. అట్టాపడి ప్రాంతంలోని ఓ తండాకు చెందిన కుమార్ అనే వ్యక్తికి పాలక్కాడ్‌లోని ఆర్మ్‌డ్ విభాగంలో పోస్టింగ్ వచ్చింది. అయితే విధుల్లో చేరిన కుమార్ గత గురువారం ఓ రైల్వేట్రాక్ వద్ద శవమై తేలారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ లభించడంతో అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలో కుమార్ పోస్టుమార్టం నివేదిక వెల్లడైన తర్వాతే పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి.
ఈ నేపథ్యంలో తన భర్త మృతిపై స్పందించిన కుమార్ భార్య సాజిని మీడియాతో మాట్లాడారు. సూసైడ్‌లో నోట్‌లో ఉన్నది తన భర్త చేతిరాతే అని ఆమె స్పష్టం చేశారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఉన్నత స్థాయి అధికారులు తన భర్తను వేధించేవారని ఆరోపించారు. ‘ నా భర్తను అకారణంగా పొట్టనబెట్టుకున్నారు. తనను వేధించిన అధికారుల పేర్లను ఆయన సూసైడ్ నోట్‌లో స్పష్టంగా రాశాడు. తన నేపథ్యం గురించి పై అధికారులు హేళనగా మాట్లాడేవారని నాతో చెప్పి తరచూ బాధపడేవాడు. ఇటీవలే ఆయన కొత్త క్వార్టర్‌కు మారాడు. ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి పాలక్కాడ్ ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని సాజిని తెలిపారు. కాగా త్రిస్సూరు రేంజ్ డీఐజీ ఇప్పటికే ఈ కేసు దర్యాప్తునకై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment