లక్నో : ఉత్తరప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం మరోసారి అభాసుపాలైంది. విద్యార్థులకు పెట్టే భోజనంలో ఎలుక రావడం కలకలం రేపింది. ఈ ఆహారం తిన్న తొమ్మిది మంది విద్యార్థులతో పాటు ఓ టీచర్ కూడా అస్వస్థతకు గురయ్యారు. తరచుగా ఇటువంటి ఘటనలు జరుగుతుండటంతో యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలు... ముజఫర్‌నగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఆరో, ఎనిమిదో తరగతి విద్యార్థులకు మంగళవారం ఆహారం వడ్డించారు. అయితే అది తిన్న కాసేపటి తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో.. భోజనం పాత్రను పరిశీలించగా అందులో ఎలుక చనిపోయి ఉంది. దీంతో వెంటనే విద్యార్థులను, ఓ టీచర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ భోజనాన్ని హాపూర్‌కు చెందిన జన్ కల్యాణ్ సంస్థా కమిటీ అనే ఎన్జీవో తయారు చేసినట్లు సమాచారం.(చదవండి: లీటరు పాలు.. బకెట్ నీళ్లు..)
ఇక ఈ ఘటనపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. అయితే ఈ విషయం తన దృష్టికి రావడంతో ముజఫర్ జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశాలు జారీ చేశారు. కాగా యూపీలో మధ్యాహ్న భోజన పథకంలో తరచుగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రెండు నెలల క్రితం యూపీలోని మీర్జాపూర్‌లో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు రోజూ రోటీ- ఉప్పు, అన్నం- ఉప్పు పెడుతున్న విషయాన్ని ఓ జర్నలిస్టు వెలుగులోకి తీసుకువచ్చారు. అదే విధంగా సోనభద్ర జిల్లాలోని పాఠశాలలో నవంబరు 29న లీటరు పాలల్లో బకెట్ నీళ్లు కలిపి విద్యార్థులకు అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం తీవ్ర విమర్శలపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment